బాహుబలి రీ రిలీజ్.. ఓ కొత్త సినిమా రేంజ్‌లో బిజినెస్?
కేవలం సినిమాపై ఉన్న క్రేజ్‌తోనే, డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తాలను వెచ్చించడానికి సిద్ధమవుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.;
'బాహుబలి'.. ఇది కేవలం సినిమా కాదు, ఒక బ్రాండ్. పదేళ్ల క్రితం ఇండియన్ సినిమా రూపురేఖలను మార్చేసిన ఈ అద్భుతం, ఇప్పుడు 'ది ఎపిక్'గా మళ్లీ థియేటర్లలోకి రాబోతోంది. అయితే, ఇది కేవలం ఒక పాత సినిమా రీ రిలీజ్ లా కాకుండా, ఒక సరికొత్త సినిమా విడుదల రేంజ్‌లో సందడి చేస్తోంది. ముఖ్యంగా రీ రిలీజ్ లో హయ్యెస్ట్ థియేట్రికల్ రిలీజ్ గా ఓ రికార్డ్ క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది.
మరో షాకింగ్ బజ్ ఏమిటంటే, దీని ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి వినిపిస్తున్న లెక్కలు ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో చర్చకు దారితీశాయి. సాధారణంగా రీ రిలీజ్‌లు అంటే ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ కోసం, మంచి ప్రింట్‌తో పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం కోసం వేస్తారు. వాటికి డీసెంట్ కలెక్షన్లు వస్తాయి, కానీ ఎప్పుడూ ఒక కొత్త సినిమా బిజినెస్‌తో పోటీ పడవు. కానీ, 'బాహుబలి: ది ఎపిక్' ఈ రూల్‌ను బ్రేక్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
కేవలం సినిమాపై ఉన్న క్రేజ్‌తోనే, డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తాలను వెచ్చించడానికి సిద్ధమవుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో ఒక లిస్ట్ చక్కర్లు కొడుతోంది. అదే 'బాహుబలి: ది ఎపిక్' తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల రేషియో. ఆ వైరల్ పోస్ట్ ప్రకారం, నైజాం హక్కులు 17 కోట్లు, సీడెడ్ 4.5 కోట్లు, ఆంధ్రా ప్రాంతం హక్కులు రూ.15 కోట్లు పలికినట్లు సమాచారం.
అంటే, మొత్తం మీద తెలుగు రాష్ట్రాల హక్కుల విలువ ఏకంగా రూ.36.5 కోట్లు. ఒక రీ రిలీజ్ సినిమాకు ఈ స్థాయిలో బిజినెస్ జరగడం అనేది ఊహకు అందని విషయం. ప్రస్తుతం ఒక టైర్-2 హీరో కొత్త సినిమా రేంజ్‌కు ఇది సమానం. దీంతో, ఈ నంబర్లలో నిజమెంత? ఇది నిజంగానే జరిగిందా? లేక కేవలం హైప్ కోసం సృష్టించిన ప్రచారమా? అనే విశ్లేషణలు మొదలయ్యాయి.
అయితే, ఈ భారీ బిజినెస్ వెనుక కొన్ని లాజికల్ కారణాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది కేవలం పాత సినిమాను మళ్లీ వేయడం కాదు. రెండు భాగాలను కలిపి, కొన్ని కొత్త సన్నివేశాలను జోడిస్తుండటమే దీనికి అతిపెద్ద ప్లస్ పాయింట్. దీనికి తోడు, 'RRR' తర్వాత రాజమౌళికి గ్లోబల్‌గా పెరిగిన బ్రాండ్ ఇమేజ్, ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ కూడా డిస్ట్రిబ్యూటర్లలో ఈ నమ్మకాన్ని పెంచి ఉండవచ్చు. ఈ నంబర్లలో నిజమెంతో, కేవలం ప్రచారమెంతో పక్కన పెడితే, ఒక రీ రిలీజ్ సినిమా బిజినెస్ గురించి ఈ స్థాయిలో చర్చ జరగడమే 'బాహుబలి' బ్రాండ్ పవర్‌కు అసలైన నిదర్శనం. ఇక ఈ నెంబర్లపై క్లారిటీ రావాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.