మల్టీప్లెక్స్ దోపిడీ వల్లే OTTలకు దగ్గరయ్యారు!
సినిమా రంగం ఎగ్జిబిషన్ విధానాలపై చాలా ఆధారపడి ఉంది. కానీ ఎగ్జిబిషన్ రంగం నానాటికీ దిగజారుతోంది.;
సినిమా రంగం ఎగ్జిబిషన్ విధానాలపై చాలా ఆధారపడి ఉంది. కానీ ఎగ్జిబిషన్ రంగం నానాటికీ దిగజారుతోంది. ప్రజల్ని థియేటర్లకు రప్పించే వ్యూహంలో లోపమే దీనికి కారణమా? పబ్లిక్ ని దోపిడీకి గురి చేయడం వల్లనే వారు థియేటర్ల వరకూ రాకుండా ఓటీటీలు, బుల్లితెరను ఆశ్రయిస్తున్నారా? అన్నది విశ్లేషించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. చాలా మంది విమర్శకులు మల్టీప్లెక్స్ ల దోపిడీని నిరంతరం విమర్శిస్తూనే ఉన్నారు.
థియేటర్ కి వెళితే ఐదురుగు సభ్యులున్న కుటుంబం 3000 నుంచి 5000 దోపిడీకి గురవ్వాలా? అనే ప్రశ్న ప్రతిసారీ తలెత్తుతోంది. అంత పెద్ద మొత్తాన్ని వీకెండ్ లో వినోదం కోసం మెజారిటీ భాగం సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఖర్చు చేయగలవా? అనేది జవాబు లేని ప్రశ్నగా మిగిలింది.
సినిమా టికెట్ ధరలతో పాటు తిండి పదార్థాలు, కోలాలు, కాఫీల ధరలు విస్తుపోయేలా చేస్తున్నాయి. ఒక కాఫీ తాగడానికి రూ.350 ఖర్చు చేయాలా? ఒక కోక్ తాగడానికి 400 ఎందుకు ఇవ్వాలి? పాప్ కార్న్ కోసం 320 చెల్లించుకోవాలా? లేదా వాటర్ బాటిల్ కోసం 50 రూపాయలు, 2 సమోసాల కోసం రూ.100 చెల్లించాల్సి రావడాన్ని ఏ తరహా దోపిడీగా చూడాలి.
ఇంచుమించు ఇవే విషయాలను నిలదీసారు నటుడు శివాజీ. అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాఫీ కోసం వెళితే 350 దోచేస్తున్నారు? ఇంటిల్లిపాదీ దాంతో కాఫీ తాగొచ్చు కదా! అందుకే జనం ఓటీటీల్లో సినిమాలు చూస్తున్నారని థియేటర్లకు రావడానికి భయపడుతున్నారని విమర్శించారు. ఇదొక్కటే కాదు... నెమ్మదిగా మల్టీప్లెక్సుల్ని మద్యం దుకాణాలుగా మార్చి కమర్షియల్ గా దండుకోవాలని చూస్తున్నారని కూడా శివాజీ సూటిగా విమర్శించారు. పీవీఆర్ సహా చాలా మల్టీప్లెక్స్ బ్రాండ్లు థియేటర్లలోనే మద్యం అమ్ముకునేందుకు అనుమతులు కోరుతూ ప్రభుత్వాలను అభ్యర్థిస్తున్నాయి. దానికి ఓకే చెబితే ఇక ప్రజలు అన్నివిధాలా దోపిడీకి గురవుతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఎగ్జిబిషన్ రంగంలో లోపాల గురించి మాట్లాడటానికి శివాజీ లాంటి నటులు వెనకాడాల్సిన పని లేదు. ఎగ్జిబిషన్ రంగంలో కర్ఛీఫ్ వేసిన వాళ్లు కనీసం సినిమాలు చూడటానికి జనం థియేటర్లకు వచ్చేలా ఏం మార్పులు చేయాలో ఆలోచిస్తే బావుంటుంది. ముఖ్యంగా థియేటర్లకు మాత్రమే వచ్చి సినిమాలు చూసే జనాల శాతం, సమూహాల శాతం పెంచడానికి ఎలాంటి ఆలోచనలు చేయాలో కూడా నిపుణులు సూచిస్తే ఇంకా బావుంటుంది. ముఖ్యంగా సంఘంలో మెజారిటీ భాగం సామాన్యులు, మధ్య తరగతి ప్రజలే కాబట్టి వారిని థియేటర్లకు రప్పించే వ్యూహాలను ఎగ్జిబిషన్ రంగం అనుసరిస్తే బావుంటుందని సూచిస్తున్నారు.