అట్లీ.. గురువు ఫార్ములానే నమ్ముకున్నాడా?

'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అల్లు అర్జున్, 'జవాన్'తో హిందీ మార్కెట్‌లో సంచలనం సృష్టించిన దర్శకుడు అట్లీ.;

Update: 2025-11-07 05:14 GMT

'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అల్లు అర్జున్, 'జవాన్'తో హిందీ మార్కెట్‌లో సంచలనం సృష్టించిన దర్శకుడు అట్లీ. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అనగానే, అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ (AA22xA6) గురించి ఇండస్ట్రీలో రోజుకో ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. లేటెస్ట్ గా, ఈ సినిమా కాన్సెప్ట్‌కు సంబంధించి టాక్ ఒకటి బాగా వైరల్ అవుతోంది.. ఇది అట్లీ తన గురువు శంకర్ ఫార్ములానే ఫాలో అవుతున్నాడా అనే చర్చకు దారితీసింది.

అట్లీ తన కెరీర్ ఆరంభంలో దిగ్గజ దర్శకుడు శంకర్ వద్ద శిష్యరికం చేశాడు. ముఖ్యంగా, ఇండియన్ సినిమా గతిని మార్చిన టెక్నికల్ వండర్ 'రోబో' సినిమాకు అట్లీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఇప్పుడు దశాబ్దం తర్వాత, అల్లు అర్జున్‌తో అట్లీ చేస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాలో కూడా 'రోబో' ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

'రోబో' చిత్రంలో రజనీకాంత్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ సినిమాలో ఆయన మూడు విభిన్న షేడ్స్‌లో అద్భుతంగా ఒదిగిపోయారు. సౌమ్యుడైన సైంటిస్ట్ వసీకరన్‌గా, ఆ తర్వాత అమాయకంగా కనిపించే మంచి రోబో 'చిట్టి'గా, చివరకు విలన్‌గా మారిన 'చిట్టి 2.0'గా.. ఇలా మూడు వేరియేషన్స్‌తో బాక్సాఫీస్‌ను కొల్లగొట్టారు.

ఇప్పుడు అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్‌లో కూడా దాదాపు ఇదే ఫార్ములాను రిపీట్ చేయబోతున్నారని సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్ మూడు విభిన్న గెటప్స్‌లో, మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నాడని ఇదివరకే టాక్ వచ్చింది. ముఖ్యంగా, అందులో ఒక నెగెటివ్ షేడ్ ఉన్న పవర్‌ఫుల్ క్యారెక్టర్ కూడా ఉందని గట్టిగా ప్రచారం జరుగుతోంది. దీంతో అట్లీ, తన గురువు సృష్టించిన ఈ 'ట్రిపుల్ షేడ్' ఫార్ములానే బన్నీ ఇమేజ్‌కు తగ్గట్టుగా వాడుతున్నాడా అనే ఊహలు మొదలయ్యాయి.

నిజానికి అట్లీకి డబుల్ రోల్స్, మల్టిపుల్ షేడ్స్ కొత్తేమీ కాదు. 'మెర్సల్', 'బిగిల్' నుంచి లేటెస్ట్ 'జవాన్' వరకు.. తన ప్రతి సినిమాలో హీరోతో డబుల్ యాక్షన్ చేయించడం, దానికి ఏదో ఒక బలమైన సోషల్ ఇష్యూను జోడించి కమర్షియల్ హిట్‌గా మలచడం అట్లీ స్టైల్. ఇప్పుడు బన్నీతో చేస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌కు కూడా ఈ మల్టిపుల్ షేడ్స్ అనే పాయింట్ కరెక్ట్‌గా సరిపోతుంది.

ఏదేమైనా, 'రోబో' లాంటి ఇంటెన్స్ కాన్సెప్ట్‌కు, అట్లీ మార్క్ మాస్ టేకింగ్, దానికి అల్లు అర్జున్ స్టైలిష్ పర్ఫార్మెన్స్ తోడైతే.. ఆ విజువల్ వండర్ ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు. దీపికా పదుకొణె హీరోయిన్‌గా, యువ సంచలనం సాయి అభ్యంకర్ సంగీతంతో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.

Tags:    

Similar News