ట్రైల‌ర్ టాక్: ఆర్య‌న్ ఖాన్ ఏదో గ‌ట్టిగానే ట్రై చేస్తున్నాడు!

అత‌డు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తొలి వెబ్ సిరీస్ `ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్` ఈ బుధ‌వారం నాడు ట్రైల‌ర్ విడుద‌ల‌ త‌రుణంలో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.;

Update: 2025-08-20 16:34 GMT

భార‌త‌దేశంలోని ఒక పెద్ద సూప‌ర్‌స్టార్ వార‌సుడు మ‌రో స్టార్ అవుతాడ‌ని ప్ర‌జలంతా ఎదురు చూస్తారు. కానీ అందుకు భిన్నంగా, తాను కెమెరా వెన‌క ద‌ర్శ‌కుడిగా సెటిల‌వుతానంటే అది నిజంగా షాకిచ్చే పెద్ద విష‌యం. కానీ అలాంటి ఒక సాహ‌సోపేత‌మైన‌ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించాడు కింగ్ ఖాన్ షారూఖ్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్.

అత‌డు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తొలి వెబ్ సిరీస్ `ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్` ఈ బుధ‌వారం నాడు ట్రైల‌ర్ విడుద‌ల‌ త‌రుణంలో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఇది ఒక బోల్డ్ వెబ్ సిరీస్ .. కానీ దానికి సంబంధించి క‌చ్ఛిత‌మైన స‌మాచారం ఏదీ బ‌య‌ట‌కు లీక్ చేయ‌లేదు. బాలీవుడ్ ప్ర‌పంచంలోని చాలా గ‌మ్మ‌త్త‌యిన విష‌యాల‌ను ఈ సిరీస్ లో రివీల్ చేస్తూనే, ఒక అంద‌మైన ప్రేమ‌క‌థ‌ను కూడా చూపిస్తున్నామ‌ని తొలి నుంచి కొన్ని విష‌యాల్ని రివీల్ చేసాడు ఆర్య‌న్. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు, ప్రోమోకి మంచి స్పంద‌న వ‌చ్చింది.

ఇంతుకుముందు షారుఖ్ స్వయంగా ఈ సిరీస్‌ను ప్రమోట్ చేస్తూ ప్రోమో గురించి మాట్లాడారు. టీజర్‌లో రొమాన్స్, యాక్షన్, డ్రామా ఆక‌ట్టుకుంటున్నాయి. విజువ‌ల్ రిచ్ గా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. సెప్టెంబ‌ర్ 18న ఈ సిరీస్ విడుద‌ల కానుండ‌గా, ట్రైల‌ర్ వీక్షించాక‌ ఆర్య‌న్ ప‌నితనాన్ని పొగిడేస్తూ క‌ర‌ణ్ జోహార్ చాలా ఎగ్జ‌యిట్ అయ్యాడు. ఆర్యన్ ల‌వ్ యు.. ఇది అన్ని రికార్డుల‌ను బ్రేక్ చేస్తుంది! అంటూ ఒక‌టే ఉత్సాహం క‌న‌బ‌రిచాడు. అలాగే మ‌న ల‌క్ష్య లీడ్ పాత్ర‌లో కిల్ చేస్తున్నాడు అని కూడా ప్ర‌శంసించాడు. ముఖ్యంగా కింగ్ ఖాన్ త‌న వార‌సుడిని ప్రమోట్ చేస్తున్న తీరు చూస్తుంటే వెబ్ సిరీస్ పై ఉత్కంఠ అంత‌కంత‌కు పెరుగుతోంది.

షారూఖ్ వార‌సుడిగా ఆర్య‌న్ పై చాలా ఒత్తిడి ఉంది. అందరి దృష్టి ఇప్పుడు అత‌డి మొద‌టి ప్ర‌య‌త్నంపైనే.. అత‌డు త‌న తొలి వెబ్ సిరీస్ లో ఏం చూపించ‌బోతున్నాడు? ద‌ర్శ‌కుడిగా నిరూపించాడా లేదా? అనే ఉత్కంఠ న‌డుమ తాజాగా ట్రైల‌ర్ విడుద‌లైంది. ట్రైల‌ర్ ఆద్యంతం విజువ‌ల్ గా మెరిపించింది. బాలీవుడ్ స్వ‌ప్న ప్ర‌పంచం అందరికీ చిక్క‌నిది.. అనే డైలాగ్ తో ట్రైల‌ర్ ని ప్రారంభించారు. క‌థానాయ‌కుడు ల‌క్ష్య‌ను యాక్ష‌న్ స్టార్ గా ఆవిష్క‌రించారు.

అత‌డు బాలీవుడ్ లో అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నించే యువ‌కుడిగా క‌నిపించ‌నున్నాడు. అలాగే ఇందులో అతిథులుగా స‌ల్మాన్ ఖాన్, ర‌ణ్ వీర్ పాత్ర‌ల‌ను కూడా పరిచ‌యం చేసారు. ఇండ‌స్ట్రీ గ్లామ్ అండ్ గ్లింప్స్ ని హైలైట్ చేసిన‌ ఈ ట్రైల‌ర్ లో అజ‌య్ త‌ల్వార్ గా బాబి డియోల్ పాత్ర‌ను ఇత‌రుల కంటే చాలా స్పెష‌ల్ గా ఆవిష్క‌రించార‌ని చెప్పాలి. అతడి లుక్, ఎంట్రీ ప్ర‌తిదీ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాయి. సినీ ప‌రిశ్ర‌మ నేప‌థ్యంలో కాన్సెప్ట్ కాబ‌ట్టి ఇందులో పెద్ద‌గా చెప్పుకోవ‌డానికి ఏమీ క‌నిపించ‌లేదు. కానీ ఆర్య‌న్ ఏదో కొత్త‌గా ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని మాత్రం అర్థం చేసుకోవ‌చ్చు. నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ సెప్టెంబ‌ర్ 18 నుంచి అందుబాటులోకి రానుంది.

Tags:    

Similar News