స్టార్ కిడ్ వర్సెస్ నార్కోటిక్స్ అధికారి వార్ పీక్స్
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ నటవారసుడు ఆర్యన్ ఖాన్ వర్సెస్ ఎన్సీబీ మాజీ అధికారి సమీర్ వాంఖడే ఎపిసోడ్స్ గురించి తెలిసిందే.;
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ నటవారసుడు ఆర్యన్ ఖాన్ వర్సెస్ ఎన్సీబీ మాజీ అధికారి సమీర్ వాంఖడే ఎపిసోడ్స్ గురించి తెలిసిందే. ముంబై క్రూయిజ్ షిప్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నాడంటూ ఆర్యన్ ఖాన్ ని వాంఖడే అరెస్ట్ చేసారు. ఆ తర్వాత ఆర్యన్ తాను నిరపరాధిని అని నిరూపించుకుని జైలు నుంచి బయటకు వచ్చాడు. అయితే ఆర్యన్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ''తానేం తప్పు చేసానో చెప్పాలని'' సమీర్ వాంఖడేను నిలదీసే ప్రయత్నం చేసాడు. ఒక రకంగా సమీర్ వాంఖడేను అత్యుత్సాహపరుడైన అధికారిగా ఖాన్ ఫ్యామిలీ భావిస్తోంది.
ఇటీవల ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా మారి `ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్` అనే వెబ్ సిరీస్ ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ లో తనను ఇమ్మిటేట్ చేసే ఒక పాత్రను దర్శకుడు ఆర్యన్ క్రియేట్ చేసాడని, తనను అవమానించేందుకు, కించపరిచేందుకు ఆ పాత్రను ఉపయోగించుకున్నాడని సమీర్ వాంఖడే కోర్టులో పిటిషన్ వేసారు. తనకు జరిగిన అవమానానికి పరువు నష్టం కింద 2 కోట్లు చెల్లించాలని, ఈ మొత్తాన్ని తాను సామాజిక కార్యక్రమాలకు ఉపయోగిస్తానని పేర్కొన్నాడు.
అయితే సమీర్ వాంఖడే దాఖలు చేసిన పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఢిల్లీ హైకోర్టులో తన సమాధానం దాఖలు చేసింది. వాంఖడే పరువు నష్టం దావాకు రెడ్ చిల్లీస్ తన సమాధానం దీనిలో ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ పరువు నష్టం దావా చట్టబద్ధంగా సమర్థించలేనిది.. అర్హత లేనిది.. పూర్తిగా తప్పుడు దావా! అంటూ కొట్టి పారేసింది. ఈ వెబ్ సిరీస్ సమాజంలో పరిస్థితులపై వ్యంగ్య రచన.. వాంఖడే పేరును ఎక్కడా మేం ప్రస్థావించలేదు .. అతడి పాత్రను మేం చిత్రీకరించలేదు.. దానిలో ఎటువంటి పరువు నష్టం కలిగించే విషయం లేదని ఆర్యన్ తరపున లాయర్ వాదిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఆ మేరకు అఫిడవిట్ ని కూడా సమర్పించింది. సమీర్ వాంఖడే కానీ, నెట్ ఫ్లిక్స్ సహా వాదులు ప్రతివాదులు ముంబైలో ఉంటున్నందున దిల్లీ హైకోర్టులో దీనిని సమర్పించలేరని, ప్రాంతం పరిధి పరంగా రెండు విభిన్నమైన స్థలాలు ఇవి అని కూడా ఆర్యన్ తరపు లాయర్ వాదిస్తున్నారు.
సీబీఐ నుంచి దోపిడీ, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వాంఖడే నిష్కళంకమైన వ్యక్తి అని భావించలేమని కూడా రెడ్ చిల్లీస్ తరపు లాయర్ వాదించారు. సిరీస్ విడుదలకు ముందే వాంఖడేను ప్రజలు అపహాస్యం పాల్జేసారు. అతడిని చాలా తప్పు పట్టారని కూడా రెడ్ చిల్లీస్ వాదించింది. ఇప్పటికే అవమానం ఎదుర్కొన్న అధికారి కాబట్టి అతడి ప్రతిష్టకు కొత్తగా నష్టం వాటిల్లేది ఏదీ లేదని కూడా వ్యాఖ్యానించింది.
స్వలింగ సంపర్కం, పాపరాజీ కల్చర్ (ఫోటోగ్రాఫర్ల కల్చర్), సెలబ్రిటీల వివాదాలపై ఇది సెటైరికల్ డ్రామా. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) కింద ఈ సిరీస్ హాస్యం, అతిశయోక్తి , పేరడీని అనుసరించే కళా ప్రక్రియ. దీనిని తప్పు పట్టకూడదు అని కూడా ఒక పెద్ద పాయింట్ ని ఆర్యన్ తరపు లాయర్ తెరపైకి తెచ్చారు. అయినా వాంఖడే అభ్యంతరం వ్యక్తం చేసిన సన్నివేశం కేవలం ఒక నిమిషం 45 సెకన్లు మాత్రమే ఉంటుంది. సిరీస్ ని అణచివేయడం అంటే, స్వేచ్ఛా వాక్ స్వాతంత్య్రాన్ని నియంత్రించడంతో సమానం. సిరీస్ లో వ్యాఖ్యలు వ్యంగ్యమా లేదా హానికరమైనదా అనేది విచారణలో మాత్రమే తేల్తుందని రెడ్ చిల్లీస్ వాదించింది. చట్టబద్ధమైన కళాత్మక వ్యక్తీకరణను అణచివేసే ప్రయత్నమిదని వాంఖడేపై ప్రతిదాడికి దిగింది.
ఆర్యన్ వెబ్ సిరీస్ ని శాశ్వతంగా నిషేధించాలని, తనకు జరిగిన పరువు నష్టంకు రూ.2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని సమీర్ వాంఖడే పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.