సౌత్ మార్కెట్లో ఖాన్ వారసుడి గ్యాంబ్లింగ్?
కింగ్ ఖాన్ షారూఖ్ వారసుడు ఆర్యన్ ఖాన్ ప్రతి అడుగు అభిమానులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది.;
కింగ్ ఖాన్ షారూఖ్ వారసుడు ఆర్యన్ ఖాన్ ప్రతి అడుగు అభిమానులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది. ఆర్యన్ తండ్రి బాటలో హీరో అవుతాడని భావిస్తే, మొదట కెమెరా వెనక ప్రతిభను నిరూపించుకోవడంపై దృష్టి సారించాడు. అతడు దర్శకుడిగా రాణించేందుకు గట్టి ప్రయత్నంలో ఉన్నాడు. తన సోదరి సుహానా ఖాన్ నటిగా వెండితెరకు పరిచయమవుతుంటే, దానికి భిన్నంగా ఆర్యన్ దర్శకుడిగా డెబ్యూ ఇస్తున్నాడు.
అతడు ఆరంభం ఒక వెబ్ సిరీస్ తో లక్ చెక్ చేసుకుంటున్నాడు. `ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్` అతడు తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్. ఈ సిరీస్ హిందీ చిత్ర పరిశ్రమపై సెటైరికల్ డ్రామా. ఇండస్ట్రీ లోగుట్టును నిర్భయంగా తెరపై ఆవిష్కరిస్తున్నాడు ఆర్యన్ ఖాన్. అసలు తెర వెనుక ఏం జరుగుతుందో దానిని తెరపై చూపించే సాహసం చేస్తున్నాడు. అతడి ఆలోచనలకు కింగ్ ఖాన్ సైతం నోరెళ్లబెట్టారు.
ఇటీవలే విడుదలైన ట్రైలర్ కి మంచి టాక్ వచ్చింది. అయితే ఇదంతా ఒక స్టార్ కిడ్ ఆరంగేట్రం గురించి మాత్రమే కాదు.. నటవారసుడి మార్కెట్ టెక్నిక్ గురించి కూడా చర్చకు తెరలేపింది. ఆర్యన్ ఖాన్ తన తండ్రిని మించి తెలివైన గేమ్ ఆడుతున్నాడు. అతడు తన సినిమాలో బాలీవుడ్ దిగ్గజ హీరోలను అతిథులుగా చూపిస్తూనే, వెబ్ సిరీస్‌లో టాలీవుడ్ దర్శకదిగ్గజం రాజమౌళిని కూడా చూపించే సాహసం చేసాడు. అసలు రాజమౌళి ఎంట్రీ వెనక మతలబు ఏమిటి? అన్నది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమాతో బిజీ బిజీగా ఉండగా, ఆర్యన్ ఖాన్ కోసం కాల్షీట్లు కేటాయించడం ఆశ్చర్యపరుస్తోంది. నవంబర్ లో SSMB 29 కి సంబంధించి పెద్ద అప్ డేట్ చెబుతారన్న చర్చలు సాగుతుండగానే, ఇప్పుడు ఆర్యన్ తెరకెక్కించిన సిరీస్ ట్రైలర్‌లో రాజమౌళి కనిపించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.
వెబ్ సిరీస్ లో రాజమౌళి సడెన్ సర్ ప్రైజ్ నిజంగా షాకిస్తోంది. ఆయన మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్‌తో చర్చలు జరుపుతూ అకస్మాత్తుగా కనిపించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. సిరీస్ సెప్టెంబర్ 18 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతుంది. రాజమౌళి మెరుపులా మెరిసి వెళతాడా? లేక అతడి పాత్ర నిడివి ఎంత ఉంటుందో వేచి చూడాలి. నేడు భారతదేశ సినిమా మార్కెట్ ని శాసిస్తూ నంబర్ వన్ దర్శకుడిగా వెలిగిపోతున్న రాజమౌళితో ఆర్యన్ సత్సంబంధాలు కొనసాగించాలనుకోవడం గొప్ప మార్కెట్ టెక్నిక్. భవిష్యత్‌లో ఆ ఇద్దరి కలయికలో సినిమా స్థాయి హాలీవుడ్ ని కొట్టేయాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.