పదేళ్లకే షార్ట్ ఫిలిం.. 14 ఏళ్లకే వీఎఫ్ఎక్స్ లో అనుభవం.. ఆయన వల్లే సాధ్యం - ఆర్యన్ ఖాన్
చాలామంది సినీ సెలబ్రిటీలు తాము ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పుడే.. తమ వారసులుగా కొడుకులను, కూతుర్లను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఉంటారు;
చాలామంది సినీ సెలబ్రిటీలు తాము ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పుడే.. తమ వారసులుగా కొడుకులను, కూతుర్లను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఉంటారు. అలా బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కూడా తన కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కానీ హీరోగా అయితే కాదు. డైరెక్టర్ గా.. హీరో కొడుకు హీరో అవ్వాలి కానీ డైరెక్టర్ ఏంటి అని కొంతమంది అనుకోవచ్చు. కానీ ఎవరికి ఏ రంగం ఇష్టం ఉంటే అందులోనే రాణించనివ్వాలి. అలా షారుక్ ఖాన్ కూడా తన కొడుకు ఇష్టాన్ని కాదనలేక దర్శకత్వ రంగం ద్వారానే ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
అలా రీసెంట్గా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ తీసిన ' ది బా****డ్స్ ఆఫ్ బాలీవుడ్' అనే వెబ్ సిరీస్ ఎన్నో విమర్శలు, వివాదాల మధ్య విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ వెబ్ సిరీస్ తో బీటౌన్ లో వైరల్ గా మారిన ఆర్యన్ ఖాన్ తన గురించి ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు. 10 సంవత్సరాల వయసులోనే తాను ఒక షార్ట్ ఫిలిం తీశానని.. 14 ఏళ్లకే విఎఫ్ఎక్స్ వర్క్ నేర్చుకున్నాను అంటూ సంచలన విషయాలు చెప్పారు. మరి ఇంతకీ ఆర్యన్ ఖాన్ తాజా ఇంటర్వ్యూలో ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం..
ఆర్యన్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు యాక్టింగ్ కంటే ఎక్కువ సినిమాలు నిర్మించడమే ఇష్టం. అందుకే పది సంవత్సరాల వయసు నుండే విఎఫ్ఎక్స్ లో ఎన్నో ప్రయోగాలు చేశాను. చిన్నప్పటినుండి యాక్టింగ్ కంటే ఎక్కువగా కథలు చెప్పడానికే ఇష్టపడతాను. నా దగ్గర చాలా స్టోరీలు ఉన్నాయి. వాటిని భిన్నంగా చెప్పడం నాకు ఇష్టం. అయితే ఒక పనిని మనం ఇష్టపడి చేస్తే దానిని మరింత అద్భుతంగా చేయగలుగుతాం అనే విషయాన్ని నేను గుర్తు పెట్టుకుంటాను.అందుకే డైరెక్షన్ ని ఎంచుకున్నాను. ఇక నా తండ్రి షారుక్ ఖాన్ సినిమా నిర్మాణంలోని ప్రతి ఒక్క అంశం గురించి చాలా విషయాలు తెలిపారు. అది కెమెరా పని అయినా, విఎఫ్ఎక్స్ పని అయినా, లైటింగ్ అయినా ప్రతి ఒక్కదాని గురించి చాలా డీప్ గా చెప్పారు. చిన్నప్పటి నుండి నేను ఆయన మాటలు వింటూ పెరిగాను.
అలా 10, 11 సంవత్సరాల మధ్యలోనే ఒక యాప్ లో విఎఫ్ఎక్స్ నేర్చుకోవడం , ఫైనల్ కట్ ప్రోలో ఎడిటింగ్ చేయడం నేర్చుకున్నాను. కరోనా వచ్చి లాక్ డౌన్ పడ్డ సమయంలో కూడా నేను ఒక కథ రాసుకున్నాను. దానికి సంబంధించిన షూటింగ్ ని ఇంట్లోనే చిత్రీకరించా.. ఎందుకంటే లాక్డౌన్ సమయంలో మాకు పెద్దగా పని లేదు కాబట్టి ఆ షార్ట్ ఫిలిం ని నేను నా సోదరి సుహానా ఖాన్, నా తండ్రి షారుక్ ఖాన్ కలిసి చిత్రీకరించాం. అయితే నేను ఆ ప్రాజెక్టులో కేవలం డిఓపి గా మాత్రమే ఉన్నాను. అలా లాక్ డౌన్ సమయంలో నేను ఈ పని స్టార్ట్ చేశాను" అంటూ తాజా ఇంటర్వ్యూలో ఆర్యన్ ఖాన్ చెప్పుకొచ్చారు.
ఇదే ఇంటర్వ్యూలో ఆర్యన్ తో పాటు ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్' వెబ్ సిరీస్ కి సహ రచయితలుగా చేసిన మనవ్ చౌహన్ ,బిలాల్ సిద్ధిఖీలు కూడా పాల్గొన్నారు. అంతేకాదు ఇదే ఇంటర్వ్యూలో ఆర్యన్ ఖాన్ మనవ్,బిలాల్ లతో ఉన్న బంధం గురించి చెబుతూ.." మేము ముగ్గురం 14 ,15 సంవత్సరాల వయసు ఉన్నప్పటినుండే షార్ట్ ఫిలింలు తీయడం మొదలుపెట్టాం" అంటూ చెప్పుకొచ్చారు. అలా చిన్నప్పటినుండే సినీ రంగం మీద ఆసక్తి తో పెరిగిన ఆర్యన్ ఖాన్ ఫైనల్గా తన తండ్రి సపోర్ట్ తో ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్ అనే వెబ్ సిరీస్ చేశారు.ఈ వెబ్ సిరీస్ లో సల్మాన్ ఖాన్,షారుక్ ఖాన్, రాజమౌళి,రణబీర్ కపూర్, అమీర్ ఖాన్,ఇమ్రాన్ హాష్మి, రణవీర్ సింగ్, దిశా పటాని, సారా అలీ ఖాన్,కరణ్ జోహార్ వంటి స్టార్ సెలబ్రిటీలు కామియో రోల్స్ చేశారు.