బాద్ షా ఫ్యాన్స్ అందరిదీ ఒకే మాట..!
ఇటీవల ది బా...డ్స్ ఆఫ్ బాలీవుడ్ కాస్టింగ్‌ను పరిచయం చేస్తూ ఒక వీడియోను విడుదల చేశాడు. షారుఖ్ ఖాన్ ను గుర్తు చేస్తూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది.;
బాలీవుడ్‌లో వారసులకు కొదవ లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలు, హీరోయిన్స్‌లో ఎక్కువ శాతం స్టార్ కిడ్స్ అనే విషయం తెల్సిందే. స్టార్ కిడ్స్‌లో ఎక్కువ శాతం మంది హీరోలు, హీరోయిన్‌లుగానే నటించాలి అనుకుంటున్నారు. నటీనటుల వారసులు మాత్రమే కాకుండా టెక్నీషియన్స్ వారసులు సైతం హీరో లేదా హీరోయిన్‌గా బాలీవుడ్ తెరపై వెలిగి పోవాలని ఆశ పడుతున్నారు. కానీ చాలా తక్కువ మందికే స్టార్‌డం దక్కుతుంది. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడానికి వారసత్వం ఉపయోగపడుతుంది. కానీ వారికి వారు సొంతంగా ప్రతిభను చూపిస్తేనే స్టార్స్‌గా నిలిచే అవకాశం ఉంటుంది. అందుకే ఎంత పెద్ద స్టార్ కిడ్ అయినా సొంత ప్రతిభ పై ఆధారపడుతున్న విషయం తెల్సిందే. ఎంతో మంది వారసులు ఇప్పటికే వచ్చారు, అదే క్రమంలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ సైతం ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.
బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు ది బా... డ్స్ ఆఫ్ బాలీవుడ్
ఆర్యన్ ఖాన్ అందరిది ఒక దారి అయితే తనది మరో దారి అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. చూడ్డానికి హీరోలా ఉన్నాడు, స్టైల్ చూస్తే తండ్రి షారుఖ్ ఖాన్ రేంజ్‌లో ఉన్నాడు. అయినా కూడా హీరోగా కాకుండా దర్శకుడిగా సినిమా చేయాలని భావిస్తున్నాడు. ఆర్యన్ ఖాన్ చాలా కాలంగా దర్శకత్వంపై శ్రద్ద పెడుతున్నట్లుగా చెబుతూ వచ్చాడు. ఇప్పటికే కూతురు నటనలో ఓనమాలు దిద్దుకుంటూ బాద్ షా కొడుకు ఆర్యన్ ఖాన్ మాత్రం దర్శకుడిగా ఒక వెబ్ సిరీస్‌ను రూపొందించాడు. బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు 'ది బా...డ్స్ ఆఫ్ బాలీవుడ్' అనే వెబ్ సిరీస్‌ను రూపొందించాడు. తనకున్న ఇమేజ్ కారణంగా సొంతంగానే ఆ వెబ్ సిరీస్‌ను ఆర్యన్ ఖాన్ ప్రమోట్ చేస్తున్నాడు. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ వెబ్ సిరీస్ నుంచి టీజర్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆర్యన్ ఖాన్ డైరెక్షన్ డెబ్యూ
ఇటీవల ది బా...డ్స్ ఆఫ్ బాలీవుడ్ కాస్టింగ్‌ను పరిచయం చేస్తూ ఒక వీడియోను విడుదల చేశాడు. షారుఖ్ ఖాన్ ను గుర్తు చేస్తూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. అదే సమయంలో షారుఖ్ ఖాన్ ఆల్ టైమ్ స్పెషల్ డైలాగ్‌ను ఆర్యన్ ఖాన్ చెబుతూ వీడియోలోకి ప్రేక్షకులను తీసుకు వెళ్లాడు. అలా మెల్లగా వీడియోలోకి వెళ్లిన ప్రేక్షకులు చాలా మంది అది షారుఖ్ ఖాన్ వాయిస్ అనుకుంటారు. కానీ సడన్‌గా ఆర్యన్ ఖాన్ కనిపించి ఇది అది కాదు అన్నట్లుగా ట్యూన్ చేస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. షారుఖ్ ఖాన్ అభిమానులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ ఈ వీడియోను తెగ లైక్ చేస్తూ షేర్ చేస్తున్నారు. ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో వెబ్ సిరీస్ కాకుండా సినిమా రావాలని కోరుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. ఇదే సమయంలో షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఆందోళన కూడా కనిపిస్తోంది.
బాలీవుడ్ లో ఆర్యన్ ఖాన్ హీరోగా ఎంట్రీ కోసం ఎదురు చూపులు
షారుఖ్ ఖాన్ వారసుడు అనగానే అంతా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాబోయే సూపర్ స్టార్ అని అనుకుంటూ ఉంటారు. కానీ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ మాత్రం తనకు హీరోగా సినిమాలు ఇష్టం లేదని, దర్శకత్వం చేస్తాను అంటూ తన డైరెక్షన్ డెబ్యూకి సిద్ధం అయ్యాడు. అంతా బాగానే ఉంది, కానీ ఇటీవల తన లుక్‌ను రివీల్ చేయడంతో పాటు, తన తండ్రి తరహాలో డైలాగ్స్ చెప్పడంతో అంతా కూడా ఆర్యన్ సినిమాల్లో నటించాలి, హీరోగా నటించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ అందరూ ఒకే మాటతో ఉన్నారు. వారు ఆర్యన్ ఖాన్ హీరోగా నటించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఆర్యన్ ఖాన్ మాత్రం దర్శకత్వం వైపు మొగ్గు చూపుతున్నాడు. అయితే భవిష్యత్తులో ఖచ్చితంగా ఆర్యన్ ఖాన్ తన తండ్రి తరహాలో నటుడిగా సూపర్ స్టార్ కావడం ఖాయం అని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.