ఏం చేస్తాడో అని చాలా భయపడ్డాను : షారుఖ్‌

ఆర్యన్‌ ఖాన్‌ దర్శకత్వంలో 'ది బ్యాడ్స్ ఆఫ్‌ బాలీవుడ్‌' అనే టైటిల్‌తో రూపొందిన వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. అంతకు ముందు ఆర్యన్‌ ఖాన్‌ తన వెబ్‌ సిరీస్‌లోని పాత్రలను పరిచయం చేస్తూ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చాడు.;

Update: 2025-08-21 13:30 GMT

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ అభిమానులతో పాటు, హిందీ ప్రేక్షకులు అంతా ఎంతో ఆసక్తిగా ఆర్యన్‌ ఖాన్‌ తెరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నారు. గత ఐదారు సంవత్సరాలుగా షారుఖ్‌ ఖాన్‌ వారసుడు ఎంట్రీ అంటూ తెగ వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకు ఆర్యన్‌ ఖాన్‌ సినిమా రంగ ప్రవేశంకు ముహూర్తం ఖరారు అయింది. అయితే ఆర్యన్‌ ఖాన్‌ అందరికి షాక్ ఇస్తూ హీరోగా కాకుండా దర్శకుడిగా వెబ్‌ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఆర్యన్‌ ఖాన్‌ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులను గురించి ఎవరికీ తెలియని విషయాలను తనదైన వ్యూ తో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ వెబ్‌ సిరీస్‌ ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కి రెడీగా ఉంది. తాజాగా ఈ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే కార్యక్రమం జరిగింది.

బాలీవుడ్‌ కథతో 'ది బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌'

ఆర్యన్‌ ఖాన్‌ దర్శకత్వంలో 'ది బ్యాడ్స్ ఆఫ్‌ బాలీవుడ్‌' అనే టైటిల్‌తో రూపొందిన వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. అంతకు ముందు ఆర్యన్‌ ఖాన్‌ తన వెబ్‌ సిరీస్‌లోని పాత్రలను పరిచయం చేస్తూ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చాడు. ఆ వాయిస్ విన్న చాలా మంది షారుఖ్ ఖాన్‌ డైలాగ్‌ డెలవరీ స్థాయిలో ఉందని కామెంట్స్ చేశారు. ఆకట్టుకునే విధంగా ఉన్న ఆ నటీనటుల పరిచయం వీడియో వెబ్‌ సిరీస్‌పై అంచనాలు పెంచింది. అంతే కాకుండా ఆర్యన్‌ ఖాన్‌ హీరోగా కాకుండా దర్శకుడిగా ఎందుకు ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ చాలా మంది విమర్శలు చేశారు. ఇంత చక్కటి గొంతు, ఇంత చక్కటి రూపం ఉన్న ఆర్యన్‌ ఖాన్‌ దర్శకత్వం చేయడం అనేది అవివేకం అని కూడా చాలా మంది కామెంట్స్ చేశారు. వాటన్నింటిని పట్టించుకోకుండా ఆర్యన్‌ ఖాన్‌ తన వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ను షారుఖ్ ఖాన్‌ చేతుల మీదుగా విడుదల చేయించాడు.

ట్రైలర్‌ లాంచ్‌లో షారుఖ్‌ ఖాన్‌

'ది బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌' వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమంలో షారుఖ్‌ ఖాన్‌ పాల్గొన్నాడు. ఆ సమయంలో షారుఖ్‌ ఖాన్‌ మాట్లాడుతూ... ఆర్యన్‌ ఖాన్‌ ఈ ప్రాజెక్ట్‌ కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. దాదాపు నాలుగు ఏళ్ల పాటు ఈ ప్రాజెక్ట్‌పై అతడు వర్క్‌ చేస్తున్నాడు. కొత్తగా ప్రయత్నించబోతున్నట్లు నాకు చెప్పాడు. ఆ సమయంలో ఏం చేస్తాడో అని భయపడ్డాను. మా ఇల్లు మన్నత్‌ సీసీ టీవీ ఫుటేజ్‌ ఏమైనా యూట్యూబ్‌లో పెట్టేస్తాడా ఏంటి అనుకున్నాను. కానీ ఇది చూసిన తర్వాత చాలా గర్వంగా ఉంది. ఖచ్చితంగా మంచి ప్రయత్నం అని చెప్పడంలో సందేహం లేదని, ప్రేక్షకులు ఖచ్చితంగా ఆర్యన్‌ ప్రయత్నంను ఆధరిస్తారనే విశ్వాసంను షారుఖ్‌ ఖాన్‌ వ్యక్తం చేశాడు.

ఆర్యన్‌ ఖాన్‌ నమ్మకం

సెప్టెంబర్‌ 18న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సిరీస్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆర్యన్‌ ఖాన్‌ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంటాడనే విశ్వాసంను షారుఖ్‌ ఖాన్‌ వ్యక్తం చేయడంతో పాటు, మొత్తం యూనిట్‌ సభ్యులకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు. ఆర్యన్‌ ఖాన్‌ మాట్లాడుతూ... ఇప్పటి వరకు ప్రేక్షకులు చూడని కథను చూపించాలి అనుకున్నాను. అందుకోసం చాలా అన్వేషించాను. చివరకు ఈ కథను ఎంపిక చేసుకున్నాను. ఈ సిరీస్‌ పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. బాబీ డియోల్‌ ఈ సిరీస్‌ లో ముఖ్య పాత్రలో నటించడం వల్ల మరింతగా హైప్‌ వచ్చింది. షారుఖ్‌ ఖాన్‌ సొంత బ్యానర్‌లో ఈ వెబ్‌ సిరీస్‌ రూపొందింది. హిందీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులను ఈ సిరీస్‌ లో ఆర్యన్‌ చూపిస్తాడని మేకర్స్ అంటున్నారు. వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అయిన తర్వాత ఆర్యన్‌ ఖాన్‌ ఫ్యూచర్‌ ప్లాన్స్ గురించి ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News