ఆయన్ని దశరథుడిగా చూడటం కష్టమే!
ఒకప్పుడు రామాయణ్ లో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్ ఇప్పుడు దశరథుడి పాత్రలో కనిపించడంపై నటి దీపిక చిఖాలియా స్పందించారు.;
మహారాష్ట్రకు చెందిన దీపికా చిఖాలియా పలు భాషల్లోని సీరియల్స్ లో నటించారు. అయితే ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టిన సీరియల్ అయితే రామాయణ్. రామానంద్ సాగర్ రూపొందించిన రామాయణ్ లో దీపిక చిఖాలియా సీత పాత్రలో నటించగా, అరుణ్ గోవిల్ రాముడిగా నటించి అందరినీ తమ నటనతో మెప్పించడంతో పాటూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుని మంచి గుర్తింపును అందుకున్నారు.
అయితే ఇప్పుడు బాలీవుడ్ లో రామాయణ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. ఇదే సినిమాలో దశరథుడి పాత్రలో అరుణ్ గోవిల్ కనిపించనున్నారు. ఒకప్పుడు రామాయణ్ లో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్ ఇప్పుడు దశరథుడి పాత్రలో కనిపించడంపై నటి దీపిక చిఖాలియా స్పందించారు.
తనతో సహా ఎంతోమందికి అరుణ్ గోవిల్ రాముడి పాత్రలో గుర్తున్నారని, రామాయణ్ సీరియల్ లో నటించినందుకు ఎంతోమంది ఆడియన్స్ రాముడిగా ఆయనపై ఎంతో ఆదరణను చూపించారని, ఇప్పుడాయన్ని దశరథుడిగా బిగ్ స్క్రీన్ పై చూడటం అందరికీ కష్టంగానే ఉంటుందని, ఒకసారి రాముడి పాత్రలో చూసిన వారిని ఆడియన్స్ మరో క్యారెక్టర్ లో ఊహించుకోలేరని దీపికా అభిప్రాయపడ్డారు.
ఎన్నో లక్షల మంది ఇప్పటికీ అరుణ్ గోవిల్ ను రాముడుగానే భావిస్తారని, రామాయణలో దశరథుడి పాత్ర చేయడం అతని పర్సనల్ ఇంట్రెస్ట్ అయినప్పటికీ ఆడియన్స్ దీన్ని యాక్సెప్ట్ చేయడం కొంచెం కష్టమేనని, ఒకసారి రాముడిగా గుర్తింపు తెచ్చుకుంటే ఆడియన్స్ దృష్టిలో ఎప్పటికీ రాముడిగానే ఉంటారని ఆమె అభిప్రాయపడ్డారు. రామాయణ కోసం తననెవరూ సంప్రదించలేదని, ఒకవేళ సంప్రదించినా రామాయణలో సీతగా కాకుండా మరో పాత్రలో కనిపించే సాహసం తాను చేయనని రీసెంట్ గానే ఆమె చెప్పిన సంగతి తెలిసిందే. కాగా రామాయణ సినిమాను నితేష్ తివారీ రూ.1600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. రామాయణ మొదటి భాగం 2026 దీపావళికి రిలీజ్ కానుండగా, రెండో భాగం 2027 దీపావళికి రిలీజ్ కానుంది.