వైవీఎస్.. కొంచెం మారాలి బాసూ!

Update: 2015-09-09 01:46 GMT
ఓ నిర్మాత ఐదు కోట్లో పది కోట్లో నష్టం వస్తే ఎలాగోలా భరించగలడు. కానీ ఓ సినిమా పాతిక కోట్ల దాకా నష్టం తెచ్చిపెడితే.. ఆస్తులన్నీ హారతి కర్పూరం చేసేస్తే.. మళ్లీ నిలబడి ఇంకో సినిమా తీయడం సాధ్యమా? సాధ్యమే అని రుజువు చేస్తున్నాడు వైవీఎస్ చౌదరి. కెరీర్ ఆరంభం నుంచి సాహసాలకు పెట్టింది పేరైన వైవీఎస్.. ‘రేయ్’ లాంటి డిజాస్టర్ తర్వాత మళ్లీ ఇంకో సినిమా తీయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ‘నేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడే’ అనే టైటిల్ తో సినిమా తీయబోతున్నాడని.. అదో లవ్ స్టోరీ అనేది మాత్రమే ఇప్పటికి వెలువడిన సమాచారం.

ఐతే ఏళ్లకు ఏళ్లు వాయిదా పడిపోయి.. చివరికి విడుదల డిజాస్టర్ అనిపించుకున్న ‘రేయ్’ దెబ్బ నుంచి చౌదరి ఎలా కోలుకున్నాడన్నదే అర్థం కావడం లేదు. ఆ సినిమా కోసం తన ఆస్తులన్నింటినీ పణంగా పెట్టాడు చౌదరి. గుడివాడలోని ఆయన రెండు థియేటర్లు కూడా తాకట్టులోకి వెళ్లిపోయాయి. సినిమా ఆడి ఉంటే బయటపడే వాడే కానీ.. అలాంటి ఊరటేమీ దక్కలేదు. మరి ఆ థియేటర్లు చౌదరి చేతికి తిరిగొచ్చాయా అనేది డౌటే. వరుసగా ఒక్క మగాడు, సలీమ్, రేయ్ లాంటి డిజాస్టర్ లు తీసిన నేపథ్యంలో చౌదరికి మళ్లీ ఫైనాన్స్ ఇవ్వడానికి ఎవరైనా ముందుకొస్తారా అనేది డౌటే. అయినప్పటికీ స్వీయ నిర్మాణంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు చౌదరి. మరి ఏ బ్యాకప్ తో బరిలోకి దిగుతున్నాడో మరి.

ఐతే చౌదరికి రిస్క్ అన్నది కొత్తేం కాదు. ‘లాహిరి లాహిరి లాహిరిలో’ చేస్తున్నపుడు చౌదరి ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడో అందరికీ తెలిసిందే. ఆ సినిమా విజయం ఆయన కాన్ఫిడెన్స్ ను ఎక్కడికో తీసుకెళ్లింది. ఐతే ఆ కాన్ఫిడెన్స్ కాస్తా ఓవర్ కావడంతోనే సమస్య వచ్చింది. నేపడి లేచే కెరటం లాంటి చౌదరి.. మళ్లీ ఓ సినిమాకు రెడీ అవుతుండటం మంచి విషయమే. ఐతే ఈసారి మరీ నేల విడిచి సాము చేయకుంటే బెటర్. బడా బడా నిర్మాతలే లో బడ్జెట్లో సినిమాలు చేసుకుంటున్న సమయమిది. చౌదరి కూడా తక్కువ బడ్జెట్ లో సినిమాలు చేసి.. ఎక్కువ లాభాలు రాబట్టేలా ప్లాన్ చేస్కోవాలి. అదనపు హంగుల మీద కాకుండా కొంచెం కంటెంట్ మీద దృష్టిపెట్టాలి. అప్పుడే మళ్లీ నిలబడగలడు.
Tags:    

Similar News