ప్రపంచంలో ఇలా ఆలోచించే ఒకే ఒక్క స్టార్ అతడొక్కడే
ప్రపంచ సంగీత సామ్రాజ్యాన్ని తనదైన డాన్స్, గాత్రంతో శాసించిన `కింగ్ ఆఫ్ పాప్` మైఖేల్ జాక్సన్ గురించి తెలియని వారుండరు.;
ప్రపంచ సంగీత సామ్రాజ్యాన్ని తనదైన డాన్స్, గాత్రంతో శాసించిన `కింగ్ ఆఫ్ పాప్` మైఖేల్ జాక్సన్ గురించి తెలియని వారుండరు. అయితే ఆయన సాధించిన విజయాల కంటే.. తన ముఖకవళికలను మార్చుకోవడానికి చేసిన ప్రయత్నాలే తరచూ చర్చనీయాంశంగా మారేవి. ముఖ్యంగా ముక్కు ఆకారాన్ని మార్చుకోవడానికి జాక్సన్ ఏకంగా 20 నుండి 30 సార్లు శస్త్రచికిత్సలు (రైనోప్లాస్టీస్) చేయించుకున్నారని ప్లాస్టిక్ సర్జన్లు అంచనా వేస్తున్నారు. బహిరంగంగా ఆయన కేవలం రెండు సర్జరీలు మాత్రమే ప్రయత్నించానని ఒప్పుకున్నా.. ఆయన ముఖంలో వచ్చిన మార్పులు మాత్రం మరో కథను చెబుతుంటాయి. జాక్సన్ జీవితకథతో రూపొందించిన మైఖేల్ ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా అతడి ముక్కు- ముఖ మార్పిడి శస్త్ర చికిత్సల గురించిన చర్చ వెబ్ లో సాగుతోంది.
లాస్ ఏంజిల్స్‌కు చెందిన ప్రముఖ సర్జన్ డాక్టర్ వాలెస్ గుడ్‌స్టెయిన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మైఖేల్ జాక్సన్ సర్జరీల కోసం క్లినిక్‌కు రెగ్యులర్ పేషెంట్‌గా ఉండేవారు. అక్కడ ఉన్న రెండేళ్ల కాలంలోనే జాక్సన్ సుమారు 10 నుండి 12 సర్జరీలు చేయించుకున్నారని.. అంటే దాదాపు ప్రతి రెండు నెలలకు ఒకసారి ఆపరేషన్ టేబుల్ ఎక్కేవారని పేర్కొన్నారు. కేవలం ముక్కుకే కాకుండా.. గడ్డం ఆకారాన్ని మార్చడం.. బుగ్గల్లో ఇంప్లాంట్స్ వేయించుకోవడం..కనురెప్పలకు కూడా సర్జరీలు చేయించుకున్నారని సమాచారం.
ఈ సర్జరీలన్నీ అత్యంత రహస్యంగా జరిగేవి. ప్రముఖ మ్యాగజైన్ కథనం ప్రకారం... క్లినిక్ సిబ్బంది ఎవరూ తనను చూడకూడదనే ఉద్దేశంతో మైఖేల్ జాక్సన్ కేవలం సాయంత్రాలు, రాత్రి సమయాల్లోనే అక్కడికి వెళ్లేవారు. దురదృష్టవశాత్తు.. పదేపదే చేసిన ఈ ప్రయోగాల వల్ల ఆయన ముక్కు చాలా చిన్నగా మారిపోవడమే కాకుండా.. ముక్కులోని మృదులాస్థి పూర్తిగా దెబ్బతిని శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారింది. ఒకానొక దశలో ముక్కు ఆకారం పూర్తిగా దెబ్బతిని సహజత్వాన్ని కోల్పోయింది.
చర్మవ్యాధి నిపుణుడు ఒకరు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దెబ్బతిన్న జాక్సన్ ముక్కును తాను ఫిల్లర్స్, హైలురోనిక్ యాసిడ్స్ ఉపయోగించి మళ్ళీ సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నించినట్లు తెలిపారు. ఈ ప్రక్రియ చాలా శ్రమతో కూడుకున్నదని.. అతడి ముక్కు మళ్ళీ మామూలుగా కనిపించేలా చేయడం.. శ్వాస మార్గాలను రిపేర్ చేయడానికి ప్రయత్నించానని తెలిపారు. జాక్సన్ రిజల్ట్ తో సంతోషించినా కానీ.. అప్పటికే అతడి ముఖంపై సర్జరీల ప్రభావం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.
ఇక జాక్సన్ చర్మం రంగు మారడం వెనుక కూడా ఒక పెద్ద కారణం ఉంది. అతడు `విటిలిగో` అనే తీవ్రమైన చర్మవ్యాధితో బాధపడేవారు.. దీనివల్ల శరీరంపై తెల్లటి మచ్చలు ఏర్పడేవి. ముఖం- చేతులపై ఉన్న ఈ మచ్చలను కవర్ చేయడానికి.. చర్మాన్ని డార్క్ చేసే చికిత్స కంటే లైట్ చేసే క్రీములను వాడటమే సరైనదని వైద్యులు సూచించారు. దీనివల్ల ఆయన చర్మం పాలిపోయినట్లుగా తెల్లగా మారిపోయింది. ఇలా తన రూపాన్ని మార్చుకోవడానికి మైఖేల్ జాక్సన్ చేసిన ప్రయోగాలు చరిత్రలో ఒక అరుదైన- వింతైన అధ్యాయంగా మిగిలిపోయాయి.