ఆ ఇద్ద‌రు భామ‌లు అడ్డంగా బుక్క‌య్యారా?

భారీ ప్రాజెక్టులో అవకాశం రావడం అనేది ఏ నటికైనా అదృష్టమే. కానీ ఒక్కోసారి ఆ అదృష్టమే సంకెళ్ల‌గా మారి కెరీర్ వేగాన్ని అడ్డుకుంటుంది.;

Update: 2026-04-26 18:45 GMT

భారీ ప్రాజెక్టులో అవకాశం రావడం అనేది ఏ నటికైనా అదృష్టమే. కానీ ఒక్కోసారి ఆ అదృష్టమే సంకెళ్ల‌గా మారి కెరీర్ వేగాన్ని అడ్డుకుంటుంది. ప్రస్తుతం కయాదు లోహర్ - రుక్మిణి వసంత్ విషయంలో ఇదే జరుగుతోందని ట్రేడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. చేతిలో భారీ సినిమాలు ఉన్నా? పాన్ ఇండియా ప్రాజెక్టుల నిబంధనలతో ఇద్దరు భామలు అడ్డంగా బుక్కయ్యారనే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ లాకింగ్ పీరియడ్ వారి కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. కయాదు లోహర్ విషయానికి వస్తే అమ్మ‌డు నేచురల్ స్టార్ నాని సరసన `ది పారడైస్` చిత్రంలో నటిస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే ఈ సినిమా ఒప్పందం ప్రకారం షూటింగ్ పూర్తయ్యే వరకూ కయాదు మరో కొత్త సినిమాకు సంతకం చేయకూడదనే నిబంధన ఉందన్న విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ కార‌ణంగా కయాదు ప్యార‌డైజ్ అగ్రిమెంట్ త‌ర్వాత కొత్త సినిమాల‌కు సైన్ చేయలేద‌ని వినిపిస్తోంది. మ‌రి త‌మిళ్, మ‌ల‌యాళంలో వ‌రుస‌గా సినిమాలు చేస్తుంద‌గా? అన్న సందేహం వ‌స్తుంది. కానీ ఈ చిత్రాల‌న్ని `ది ప్యార‌డైజ్` కు ముందే క‌మిట్ అయిన చిత్రాల‌ట‌. ప్యార‌డైజ్ మొద‌లైన త‌ర్వాత ఏ కొత్త సినిమాకు సైన్ చేయ‌లేద‌ని తెలుస్తోంది. ఈ కార‌ణంగా టాలీవుడ్ లో పెద్ద నిర్మాణ సంస్థల నుంచి వ‌చ్చిన అవకాశాలను కూడా కోల్పోయిందంటున్నారు.

అలాగే కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెర‌కెక్కుతోన్న‌ భారీ పాన్ ఇండియా చిత్రంలో రుక్మిణి కథానాయికగా ఎంపికైంది. ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులో అవకాశం రావడం గొప్ప విషయమే అయినా? ఈ సినిమా పూర్తయ్యే వరకు ఆమె వేరే ఏ సినిమా సైన్ చేయకూడదనే కమిట్‌మెంట్‌తో ఉన్నట్లు సమాచారం. ప్రశాంత్ నీల్ సినిమాలు అంటే కనీసం ఏడాదికి పైగా సమయం తీసుకుంటాయి. అంతవరకు రుక్మిణి మ‌రో సినిమాకు క‌మిట్ అయ్యే అవ‌కాశాలు లేవు. ప్ర‌స్తుతం `టాక్సిక్` లో న‌టిస్తున్నా? తార‌క్ సినిమా మొద‌లు కాక‌ముందే అగ్రిమెంట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఇది. ఈ రెండు త‌ప్ప రుక్మిణి వ‌సంత్ ఖాతాలో మ‌రే కొత్త ప్రాజెక్ట్ లేదు.

భారీ బడ్జెట్ సినిమాలు - పాన్ ఇండియా చిత్రాల మేకర్స్ హీరోయిన్ల డేట్ల విషయంలో పక్కాగా ఉంటారు. తమ సినిమాలోని లుక్ బయటకు రాకూడదని , నటి దృష్టి మరే ఇతర సినిమాపై ఉండకూడదని ఇలాంటి నిబంధనలు విధిస్తుంటారు. కానీ కెరీర్ ఆరంభంలో ఉన్న నటీమణులకు ఇది ఒక రకమైన రిస్క్ అని చెప్పాలి. వరుసగా సినిమాలు చేస్తూ జనాల్లో నానితేనే గుర్తింపు ఉంటుంది. లేదంటే ఈ గ్యాప్‌లో కొత్త భామలు వెలుగులోకి వచ్చే ప్రమాదం ఉంది. కయాదు ,రుక్మిణి నటనతో ఇప్పటికే మంచి పేరు సంపాదించారు. ఆ కార‌ణంగానే టాలీవుడ్ లో డిమాండ్ ఉంది. లైన్ లో ఉన్న పాన్ ఇండియా ప్రాజెక్టులు విడుద‌లై స‌క్సెస్ అయితే ఆ ఇమేజ్ రెట్టింపు అవుతుంది. ఆ నమ్మకంతోనే భామ‌లిద్ద‌రు కఠినమైన నిబంధనలు అంగీకరించి ఉండొచ్చు.

Tags:    

Similar News