ఫస్ట్ లుక్: ''ప్రేమ్ కుమార్'' గా 'ఏక్ మినీ కథ' హీరో..!

Update: 2021-06-04 05:31 GMT
'వర్షం' ద‌ర్శ‌కుడు శోభ‌న్ కుమారుడు సంతోష్ శోభన్ ''పేపర్ బాయ్'' సినిమాతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల ''ఏక్ మినీ 'కథ'' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డైరెక్ట్ ఓటీటీ వేదికగా విడుదలైన ఈ చిత్రం మంచి ఆదరణ దక్కించుకోవడమే కాకుండా.. యువ హీరో నటనకు మంచి మార్కులు పడ్డాయి. బోల్డ్ క‌థలో ఆత్మ‌నూన్య‌తా భావం గల యువకుడిగా సంతోష్ శోభ‌న్ న‌ట‌న‌ ప్రేక్షకులను మెప్పించింది. ఈ నేపథ్యంలో తాజాగా ''ప్రేమ్ కుమార్'' అనే టైటిల్ తో తన కొత్త సినిమాని ప్రకటించాడు.

అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో రాశీ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై.లి. పతాకంపై శివప్రసాద్ పన్నీరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈరోజు శుక్రవారం ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించడంతో పాటు టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. పెళ్లి కొడుకు గెటప్ లో చేతిలో తాళి పట్టుకొని భూతద్దంలో చూస్తున్న సంతోష్ శోభన్ కార్టూన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. పెళ్లి స‌మ‌స్య‌తో స‌త‌మ‌త‌మ‌య్యే అబ్బాయిగా.. అందర్నీ నవ్వించబోతున్నాడని తెలుస్తోంది.

సాధారణంగా తెలుగు సినిమా క్లైమాక్స్ లో హీరో వచ్చి కొన్ని భారీ సెంటిమెంట్ డైలాగ్స్ చెప్పి హీరోయిన్‌ ను పెళ్లి చేసుకుంతాడు. కానీ అప్పుడు పెళ్లి పీటల మీద కూర్చున్న పెళ్లికొడుకును మాత్రం ఎవరూ పట్టించుకోరు. అటువంటి ఓ పెళ్లికొడుకు తనకు పెళ్లి అవ్వడం లేదనే ఫ్రస్ట్రేషన్‌ లో ఏం చేశాడనేది ''ప్రేమ్ కుమార్'' సినిమా అని చిత్ర బృందం తెలిపింది. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకోగా.. లాక్‌ డౌన్ తర్వాత మిగతా భాగం షూట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంతో కృష్ణచైతన్య - రుచిత సాధినేని - కృష్ణతేజ - సుదర్శన్ - అశోక్ కుమార్ - ప్రభావతి - మధు తదితరులు నటిస్తున్నారు.

'ప్రేమ్ కుమార్' చిత్రానికి దర్శకుడు అభిషేక్ మహర్షి - రచయిత అనిరుధ్ కృష్ణమూర్తి కలిసి కథ అందించారు. అనంత్ శ్రీకర్ సంగీతం సమకూర్చగా.. కిట్టు విస్సాప్రగడ పాటలు రాస్తున్నారు. రాంపీ నందిగాం సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. కొత్త త‌ర‌హా కాన్సెప్టులు ఎంచుకుంటున్న యంగ్ హీరో సంతోష్ శోభన్ కు 'ప్రేమ్ కుమార్' ఎలాంటి విజయాన్ని అందిస్తాడో చూడాలి.
Tags:    

Similar News