పాన్ ఇండియాను కొట్టేయడానికి యువ‌ హీరో టెక్నిక్

Update: 2023-05-29 09:29 GMT
వివాదాల‌తో ప్ర‌చారం నేటి ఎత్తుగ‌డ‌. ఇది స‌త్ఫ‌లితాలిస్తుంద‌ని ఇంత‌కుముందు ప‌ద్మావ‌త్- గంగూభాయి క‌థియావాడీ- కాశ్మీర్ ఫైల్స్- ది కేర‌ళ స్టోరి లాంటి చిత్రాలు నిరూపించాయి. భ‌న్సాలీ- మ‌ధుర్ భండార్క‌ర్ లాంటి ద‌ర్శ‌కులు తెర‌కెక్కించే చాలా సినిమాలు వివాదాల‌తోనే బోలెడంత ప్ర‌చారం కొట్టేస్తుంటాయి. ఇక ఆర్జీవీ మార్క్ వివాదాల ప్ర‌చారార్భాటం గురించి తెలిసిందే. హిట్టు కొట్టినా కొట్ట‌క‌పోయినా వివాదాలు ఆయ‌న స్టైల్.

కానీ ఈ వివాదాల‌న్నిటికీ భిన్న‌మైన వివాదంతో ఇప్పుడు టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నిఖిల్ హెడ్ లైన్స్ లో నిలుస్తున్నాడు. నిఖిల్ న‌టించిన స్పై ఇప్ప‌టికే వివాదాస్ప‌ద కంటెంట్ తో వ‌స్తుండ‌డంతో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు సుభాష్ చంద్ర‌బోస్ అన్ నోన్ ఎండింగ్ స్టోరీతో ఈ సినిమా తెర‌కెక్క‌డంతో దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ సాగుతోంది.

ఇంత‌లోనే నిఖిల్ న‌టిస్తున్న మ‌రో చిత్రం వివాదంలోకి వ‌చ్చింది. నిఖిల్ క‌థానాయ‌కుడిగా 'ఇండియా హౌస్' ప్ర‌క‌ట‌న వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే. రామ్ చరణ్- అభిషేక్ అగర్వాల్ నిర్మాతలుగా ఈ సినిమా ప్రారంభ ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఈ ప్రకటన అనేక వివాదాలను మోసుకురావ‌డ‌మే గాక‌ అనేక ప్రశ్నలను రేకెత్తించింది. నిజానికి స్వాతంత్య్ర‌ సమరయోధులు ఎందరో ఉండగా వీర్ సావర్కర్ పైనే సినిమా ఎందుకు తీయాలి? అన్న‌ది ఒక ప్ర‌శ్న‌.

స్వాతంత్య్ర‌ పోరాట సమయంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒక పుస్తకాన్ని రాసినందుకు వీర్ సావర్కర్ ను జైలులో పెట్టారని.. మహాత్మా గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సేతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతారు. వీర్ సావర్కర్ హిందూమతం వైపు మొగ్గు చూపడం వల్ల ఆయన చుట్టూ వివాదాలుండేవి. అతడి పుస్తకంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక కుట్రలు 'ఇండియా హౌస్‌'లో పుట్టాయని రాసారు. అందుకే దానిపై సినిమా తీస్తున్నారా? అంటూ సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏది ఏమైనా నిఖిల్-చ‌ర‌ణ్‌-అభిషేక్ బృందం స‌రైన టైమింగ్ తో స‌రైన ప్ర‌ణాళిక‌తో బ‌రిలో దిగింది. కానీ తాజా టైటిల్ ప్ర‌క‌ట‌న వివాదాస్ప‌దంగా మారింది.

దీనిని కాశ్మీర్ ఫైల్స్ త‌ర‌హాలో భాజ‌పకు హిందూత్వ‌కు మ‌ద్ధ‌తుగా నిలిచే సినిమా అన్న ప్ర‌చారం సాగుతోంది. అయితే ఈసారి నిఖిల్ బృందం ఇలాంటి ఎత్తుగ‌డ‌ను ఎందుకు అనుస‌రిస్తోంది? అన్న‌ది మిస్ట‌రీగా మారింది. నిజానికి కార్తికేయ 2తో నిఖిల్ కి ఉత్త‌రాదినా మంచి గుర్తింపు ద‌క్కింది. కార్తికేయ 2 నార్త్ బెల్ట్ లో బంప‌ర్ హిట్ కొట్టింది. నిఖిల్ కి పాన్ ఇండియా క్రేజ్ ను తెచ్చింది. అదే క్రమంలో నిఖిల్ త‌దుప‌రి స్పై చిత్రంతో ఉత్త‌రాదినా హిట్టు కొడ‌తాడ‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఇంత‌లోనే ఇప్పుడు ఇండియా హౌస్ భారతీయ చరిత్రలో వివాదాస్పద అంశాల ఆధారంగా తెర‌కెక్కుతుండ‌డంతో నిఖిల్ నిత్యం హెడ్ లైన్స్ లోకి రానున్నాడు. దీంతో పాన్ ఇండియా లెవ‌ల్లో మార్కెట్ కూడా కొట్టేస్తాడ‌ని విశ్లేష‌ణ‌లు ఊపందుకున్నాయి.

వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా ఇప్పటికే కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడంతో ప్రతిపక్ష కాంగ్రెస్ స‌హా ప‌లు రాజకీయ పార్టీలు దీనిపై అసంతృప్తిని వ్యక్తం చేశాయి. అదే రోజు 'ఇండియా హౌస్' ప్రకటన మరిన్ని వివాదాలకు దారితీసింది. అయితే ప్ర‌తి వివాదానికి ఒక స‌మాధానం ఉంటుందని 'ది కేర‌ళ స్టోరి'.. 'కాశ్మీర్ ఫైల్స్' విజ‌యాలు వెల్ల‌డించాయి. అలాంటి ఒక స‌రైన స‌మాధానంతో చిత్ర‌బృందం ముందుకు వ‌స్తుందేమో చూడాలి.

Similar News