ఇప్పటికి ఉదయ్‌ కిరణ్‌ చివరి సినిమాకు మోక్షం దక్కడం లేదేం?

Update: 2020-06-25 14:00 GMT
బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ ఆత్మహత్య తెలుగు వారికి మరోసారి ఉదయ్‌ కిరణ్‌ ను గుర్తు చేసింది. సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఎక్కువ మంది ఉదయ్‌ కిరణ్‌ ఆత్మహత్య గురించి కూడా మాట్లాడుకున్నారు. ఇద్దరు కూడా ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తక్కువ సమయంలోనే స్టార్స్‌ గా గుర్తింపు దక్కించుకున్నారు. అలాగే ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. డిప్రెషన్‌ తో ఆత్మహత్య చేసుకున్న ఉదయ్‌ కిరణ్‌ చివరి సినిమా ‘చిత్రం చెప్పిన కథ’.

ఉదయ్‌ కిరణ్‌ చనిపోయి ఆరు సంవత్సరాలు అవుతున్నా.. సినిమా పూర్తి అయ్యి అంతకు మించి అవుతున్నా కూడా ఇప్పటి వరకు చిత్రం చెప్పిన కథ మాత్రం విడుదల కావడం లేదు. మొన్నటి వరకు అంటే ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తే ప్రేక్షకులు చూస్తారో లేదో అనే అనుమానం.. అసలు థియేటర్లు దొరికేనా అనే అనుమానం కూడా ఉండేది. కాని ఇప్పుడు ఓటీటీలు వచ్చిన తర్వాత అన్ని సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి.

గత మూడు నెలల కాలంగా జనాలు ఓటీటీలకు అతుక్కు పోయిన నేపథ్యంలో ఉదయ్‌ కిరణ్‌ చిత్రం చెప్పిన కథ ను విడుదల చేసి ఉంటే మంచి లాభాలు వచ్చేవి అనేది విశ్లేషకుల మాట. సినిమా విడుదలకు సిద్దంగా ఉన్నా.. ఖచ్చితంగా ఉదయ్‌ కిరణ్‌ క్రేజ్‌ తో మంచి బిజినెస్‌ అయ్యే ఛాన్స్‌ ఉన్నా కూడా ఎందుకు విడుదల చేయడం లేదు అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా విడుదల కాకుండా వెనుక ఏమైనా శక్తులు అడ్డుకుంటున్నాయా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఉదయ్‌ కిరణ్‌ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Tags:    

Similar News