శ్రీను వైట్లకు న్యూ ఇయర్ హిట్టిచ్చేనా?

Update: 2020-12-21 16:30 GMT
కొంతకాలం క్రితం వరకూ శ్రీను వైట్ల పేరు స్టార్ డైరెక్టర్ల జాబితాలో కనిపించేది. కానీ ఆ తరువాత ఆ జాబితాలో ఆయన పేరును వెతుక్కోవాల్సి వస్తోంది. అందుకు కారణం వదలకుండా వెంటాడుతున్న పరాజయాలు. నిజానికి శ్రీను వైట్ల మంచి విషయమున్న డైరెక్టర్. కథాకథనాలపై ఆయనకి మంచి పట్టు ఉంది. ఒక సినిమా నుంచి ఆడియన్స్ ఆశించే వినోదపరమైన అంశాలు ఏ స్థాయిలో ఉండాలనేది ఆయనకి బాగా తెలుసు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ను కలుపుకుంటూ, కామెడీ పాళ్లను ఎక్కువగా మిక్స్ చేయడం శ్రీను వైట్ల స్టైల్. అదే ఆయనకి ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది.

తెలుగు సినిమాల్లో అప్పటివరకూ కామెడీ కోసం సెపరేట్ ట్రాక్ లు నడిపించడం ఎక్కువగా ఉండేది. హీరోలు ఎక్కువగా లవ్ ..  యాక్షన్ .. ఎమోషన్ సీన్లకే పరిమితమయ్యేవారు. అలాంటి పద్ధతికి వీడ్కోలు చెప్పిన దర్శకుల జాబితాలో శ్రీను వైట్ల ముందు వరుసలో కనిపిస్తాడు. కథలోని హాస్యంలో కథానాయకుడిని కూడా ఇన్వాల్వ్ చేసిన ఘనత ఆయనకే చెందుతుంది. హాస్యం అనేది ఒక ప్రత్యేకమైన ట్రాక్ గా పెట్టుకుంటే, అది అసందర్భంగా వచ్చి వెళుతూ ఉంటుంది. అలా కాకుండా హీరో చుట్టూ తిరిగే కథలో హాస్యాన్ని కలిపేస్తే అది నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ను అందిస్తుందని ఆయన భావించాడు .. అక్కడే ఆయన సక్సెస్ ను సాధించాడు.

శ్రీను వైట్ల పేరు వినగానే ఆయన సినిమాల్లోని కామెడీ ఎపిసోడ్స్  ప్రేక్షకులకు గుర్తొస్తాయి. అవి థియేటర్లో నవ్వులు పూయించడమే కాదు, అప్పుడప్పుడు గుర్తుకొచ్చి మరీ నవ్విస్తుంటాయి. అందుకు ఉదాహరణగా 'ఆనందం' .. 'వెంకీ' .. 'ఢీ' .. 'రెఢీ' .. 'నమో వెంకటేశ' .. 'దూకుడు' సినిమాలు కనిపిస్తాయి. ఈ సినిమాలు టీవీల్లో ఎన్ని మార్లు ప్రసారమైన మంచి రేటింగ్ రావడానికి కారణం శ్రీను వైట్లకి కామెడీ పై గల పట్టు. కెరియర్ ను ఆరంభించిన చాలా తక్కువ సమయంలోనే ఆయన తనదైన మార్క్ చూపిస్తూ, సీనియర్ స్టార్ హీరోలతోను .. యువ కథానాయకులతోను హిట్లు అందుకున్నాడు.

తొలి పదేళ్లలో భారీ హిట్లకు .. బాక్సాఫీస్ వసూళ్లకు అర్థం చెప్పిన శ్రీను వైట్ల, గత పదేళ్లుగా సక్సెస్ ను అందుకోలేకపోయాడు. ఎప్పటి మాదిరిగానే ఆయన కథలను అల్లుకున్నాడు .. కామెడీని కలిపి అందించాడు. అయినా ఆయనకి కాలం .. కథ రెండూ కలిసిరాలేదు. వరుస పరాజయాల కారణంగా ఆయన వెనుకబడ్డాడు. కొత్త సంవత్సరంలో తన సత్తాను చాటడానికి ప్రస్తుతం ఆయన సిద్ధమవుతున్నాడు. మంచు విష్ణు హీరోగా గతంలో చేసిన హిట్ మూవీ 'ఢీ'కి సీక్వెల్ చేయడానికి రంగంలోకి దిగుతున్నాడు. ఈ సినిమాకి 'డి అండ్ డి' డబుల్ డోస్ అనే టైటిల్ ను ఖరారు చేశాడు. మంచు విష్ణు హీరోగా ఆయన సొంత బ్యానర్లోనే రూపొందే ఈ సినిమాను, వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే కసితో ఉన్నాడు. న్యూ ఇయర్ ఆయనకి కొత్త ఉత్సాహాన్ని ఇవ్వాలనే కోరుకుందాం!
Tags:    

Similar News