టాప్ స్టోరి: ఆర్మీ జ‌వాన్స్ మిష‌న్!

Update: 2019-06-03 05:06 GMT
క్లాసిక్ డేస్ నుంచి తెలుగు సినిమా క‌థ‌ల్లో ఆర్మీ నేప‌థ్యానికి ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. స‌క్సెస్ రేటు ఉంది. దేశ‌భ‌క్తి- ఆర్మీ నేప‌థ్యం అన‌గానే తెలుగు ప్రేక్ష‌కుల్లో ఉండే ఎగ్జ‌యిట్ మెంటే వేరు. దానిని ఎన్‌క్యాష్ చేయ‌డంలో మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఎన్నోసార్లు ప‌నిత‌నం చూపించారు. `సిపాయి చిన్న‌య్య‌`గా అక్కినేని న‌ట‌వైదుష్యాన్ని అంత తేలిగ్గా మ‌ర్చిపోలేం. ``నా జన్మభూమి ఎంత అందమైన దేశము ..  నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము .. నా సామిరంగా హాయ్ హాయ్`` గీతం జ‌నాల నోళ్ల‌లో ఎంతో ఇదిగా నానింది. అటుపైనా విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ ఎన్టీఆర్ కి గొప్ప పేరు తెచ్చిన సినిమాలు ఆర్మీ బ్యాక్ డ్రాప్ వే. బొబ్బులి పులి- మేజ‌ర్ చంద్ర‌కాంత్ చిత్రాలు ఎన్టీఆర్ కు గొప్ప పేరు తెచ్చాయి. బాక్సాఫీస్ వ‌ద్ద క‌మ‌ర్షిల్ హిట్స్ సాధించాయి. స్టాలిన్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి పాత్ర ఆర్మీ బ్యాక్ డ్రాప్ అన్న సంగ‌తి తెలిసిందే. ఇక హీరో రాజ‌శేఖ‌ర్ `ఎవడైతే నాకేంటి` చిత్రంలో ఆర్మీ అధికారిగా న‌టించారు. ఇటీవ‌లే వ‌చ్చిన `పీఎస్వీ గరుడ‌వేగ‌` చిత్రంలోనూ రాజ‌శేఖ‌ర్ ఎన్ఐఏ అధికారిగా న‌టించ‌డం ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్ట‌డం తెలిసిందే. ఆర్మీ నేప‌థ్యం అన‌గానే సురేష్ గోపి- మోహ‌న్ లాల్ వంటి స్టార్లు న‌టించిన క్లాసిక్స్ లో న‌ట‌ప్ర‌తిభ గుర్తుకు వ‌స్తుంది.  క్రిష్ `కంచె` చిత్రంలో వ‌రుణ్ తేజ్ ఆర్మీ అధికారిగా అద్భుత న‌ట‌న‌తో మైమ‌రిపించాడు. `1971:  బియాండ్ బార్డ‌ర్స్` అంటూ అల్లు శిరీష్ ఆర్మీ నేప‌థ్యం సినిమాలో న‌టించి మెప్పించారు. మ‌ల‌యాళంలో పెద్ద హిట్ చిత్ర‌మిది.

రీసెంట్ టైమ్స్ లో ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ క‌థానాయ‌కుడిగా ఏ.ఆర్.మురుగ‌దాస్ తెర‌కెక్కించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ తుపాకి. ఈ చిత్రంలో న‌గ‌రంలోని స్లీప‌ర్స్ సెల్స్ పై ఆప‌రేష‌న్ నిర్వ‌హించే ఆర్మీ అధికారిగా విజ‌య్ న‌ట‌నకు గొప్ప పేరొచ్చింది. ఆర్మీ నేప‌థ్యంలో వ‌చ్చి పెద్ద‌ స‌క్సెస్ సాధించిన చిత్ర‌మిది. ఇండో-పాక్ బార్డ‌ర్ తీవ్ర‌వాదం.. స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ నేప‌థ్యంలో వ‌చ్చిన బాలీవుడ్ మూవీ `యూరి` సంచ‌ల‌నాల్ని మ‌ర్చిపోలేం. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే ఓ ప్ర‌త్యేక‌మైన సినిమాగా యూరికి గుర్తింపు ద‌క్కింది. విక్కీ కౌశ‌ల్ క‌థానాయ‌కుడిగా `యూరి` సెక్టార్ లో ఆర్మీ బ్యాక్ డ్రాప్ ఆప‌రేష‌న్ బిగ్ స‌క్సెస్ అయ్యింది. `నా పేరు సూర్య` అంటూ రైట‌ర్ వ‌క్కంతంని ద‌ర్శ‌కుడిని చేస్తూ బ‌న్ని ఆర్మీ అధికారిగా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచి నిరాశ‌ప‌రిచినా అందులో బ‌న్ని ఆర్మీ లుక్ కి.. భారీ యాక్ష‌న్ కి గొప్ప ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

కొంత గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ ఆర్మీ నేప‌థ్యంలోని క‌థ‌ల‌తో తెలుగులో సినిమాలు తెర‌కెక్క‌డం ఉత్కంఠ పెంచుతోంది. 2019-20 రిలీజెస్ లో టాలీవుడ్ - బాలీవుడ్ స‌హా అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో ఓ డ‌జ‌ను వ‌ర‌కూ ఆర్మీ నేప‌థ్యం సినిమాలు రిలీజ్ కానున్నాయ‌ని తెలుస్తోంది. ఇక టాలీవుడ్ లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టిస్తున్న 26వ సినిమాకి `స‌రిలేరు నీకెవ్వ‌రు` ఆర్మీ నేప‌థ్యంలోని సినిమా. 2020 సంక్రాంతి బ‌రిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో మ‌హేష్ ఆర్మీ మేజ‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో ఆర్మీ అధికారి క‌నెక్ష‌న్ ఏంటి? అన్న‌ది తెర‌పై చూడాల్సిందే. `ఎఫ్ 2` ఫేం అనీల్ రావిపూడి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అనీల్ సుంక‌ర‌- దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా క‌థ గురించి మునుముందు మ‌రిన్ని సంగ‌తులు రివీల్ కావాల్సి ఉంది.

ఇక విక్ట‌రీ వెంక‌టేష్ - నాగ‌చైత‌న్య క‌థానాయ‌కులుగా న‌టిస్తున్న `వెంకీ మామ‌`కు ఆర్మీ క‌నెక్ష‌న్ ఉత్కంఠ రేపేదే. ఈ చిత్రంలో నాగ‌చైత‌న్య ఆర్మీ అధికారిగా న‌టిస్తున్నారు. ప‌ల్లెటూరికి వ‌చ్చాక మామ వెంకీతో అల్లుడు నాగ‌ చైత‌న్య పండించే కామెడీ ఏంటో.. ఎమోష‌న్ క‌థేంటో తెర‌పై చూడాల్సిందేన‌ట‌. సీనియ‌ర్ న‌టుడు .. ద‌ర్శ‌క‌నిర్మాత హ‌ర‌నాథ్ పోలిచ‌ర్ల న‌టిస్తున్న తాజా సినిమా `కెప్టెన్ రానా ప్ర‌తాప్` ఆర్మీ నేప‌థ్యంలో వస్తున్న‌దే. `ఏ జ‌వాన్స్ స్టోరి` అంటూ రీసెంట్ గానే పోస్ట‌ర్ ని రిలీజ్ చేశారు. ఇందులో హ‌ర‌నాథ్ ఆర్మీ ఆఫీస‌ర్ లుక్ ఆక‌ట్టుకుంది. ఈ నెల‌లోనే సినిమా రిలీజ్ కానుంది. హ‌ర‌నాథ్ కి మెగాస్టార్ ఎంతో స‌న్నిహితుడు. ఆయ‌న ప్ర‌మోష‌న్ ఈ సినిమాకి ఉంటుంద‌ని భావిస్తున్నారు. వీటితో పాటు మ‌రిన్ని ఆర్మీ నేప‌థ్యం సినిమాలు తెలుగులో ప్రీప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉన్నాయ‌ని తెలుస్తోంది. అటు బాలీవుడ్ లోనూ `స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ 2` నేప‌థ్యంలో నాలుగైదు సినిమాలు తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

    
    
    

Tags:    

Similar News