ఇండియన్ టాప్ డైరెక్టర్ పరిస్థితేంటి.. ఇలా మారింది..??

Update: 2021-04-15 13:17 GMT
ఇండియన్ టాప్ దర్శకులలో ఒకరు శంకర్. ఇప్పటివరకు దర్శకుడుగా చేసింది పదమూడు సినిమాలే కానీ స్టార్డం మాత్రం ఓ రేంజిలో దక్కించుకున్నాడు. నిజానికి ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ డైరెక్టర్లలో ఒకరు శంకర్. దాదాపుగా దర్శకుడుగా కెరీర్ ప్రారంభించి ఇరవై ఎనిమిదేళ్లు అవుతోంది. కానీ గత పదేళ్లుగా ఆయనకు ఏమైందో ఎవరికీ అర్ధం కావడం లేదు. ఎందుకంటే 2010లో వచ్చిన రోబో సినిమా తర్వాత శంకర్ కెరీర్ మెల్లమెల్లగా టాప్ నుండి కిందికి పడిపోతూ వస్తోంది. క్రేజ్ అయితే అలాగే ఉంది కానీ సినిమాలపరంగా హిట్స్ కరువయ్యాయి. రోబో సినిమా తర్వాత బాలీవుడ్ 3ఇడియట్స్ రీమేక్ 'స్నేహితుడు', విక్రమ్ తో ఐ, రజినీతో రోబో-2 తీసాడు కానీ ఒక్కటీ బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయాయి. అసలు ఏంటో అని ఆలోచించేలోపు వెంటనే భారతీయుడు సీక్వెల్ ప్రకటించాడు.

ఆ సినిమా ఎప్పుడైతే మొదలయ్యిందో అప్పటినుండి శంకర్ వివాదాల పాలవుతున్నాడు. ఆ సినిమా షూటింగ్ దశలో ఉండగానే షూటింగ్ లో ప్రమాదాలు జరగడం.. కరోనా రావడం ఇలా అడ్డంకులు ఎదురయ్యాయి. కరోనా నుండి బయటపడి మళ్లీ సినిమా ప్రారంభం అవుతుందని అనుకుంటే.. సినిమా ఆగిపోయిందని టాక్ వచ్చింది. ఇంతలో రాంచరణ్ తో సినిమా ప్రకటించాడు. మళ్లీ భారతీయుడు నిర్మాతలు మా ఎప్పుడు కంప్లీట్ చేస్తావంటూ విమర్శించారు. ఆ వివాదం ముగిసింది.. రాంచరణ్ సినిమా స్టార్ట్ అవుతుందని అనుకునేలోపు తాజాగా బాలీవుడ్ హీరోతో అపరిచితుడు హిందీ రీమేక్ ప్రకటించాడు.

ఈ సినిమా వివాదం శంకర్ ను మరింత కిందకి లాగేసిందని చెప్పాలి. నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ సోషల్ మీడియా వేదికగా శంకర్ పై పూర్తిగా నిప్పులు చెరిగాడు. మరి ఆ నిర్మాత పర్మిషన్ లేకుండా శంకర్ ఎలా హిందీ రీమేక్ అనౌన్స్ చేసాడనే సందేహాలు అందరిలో వ్యక్తం అవుతున్నాయి. శంకర్ అంటే అంచనాలు, అభిమానం వేరే. కానీ అటు భారతీయుడు సీక్వెల్ ఆగిపోవడం, ఇటు రాంచరణ్ సినిమా కన్ఫర్మ్ కాలేదు. ఇప్పుడు అపరిచితుడు రీమేక్ ముందే వివాదంలో చిక్కుకొని సతమతమవుతున్నాడు. ఇవన్నీ బట్టి శంకర్ పరిస్థితి ఏం బాలేదని అర్ధమవుతుంది. ఇండియన్ జేమ్స్ కామెరూన్ గా పిలుచుకునే శంకర్ ఇప్పుడిలా ఎటుతేలని పరిస్థితిలో చిక్కుకోవడం గమనార్హం. మరి ఈ వివాదాల నుండి బయటపడి ఎప్పుడు సినిమా ప్రారంభిస్తాడో చూడాలి.
Tags:    

Similar News