రాజమౌళి తర్వాతి సినిమాపై విజయేంద్ర...

Update: 2017-10-22 07:31 GMT
‘బాహుబలి’ తర్వాత రాజమౌళి సినిమా ఏంటా అని దేశవ్యాప్తంగా జనాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఐతే ‘బాహుబలి’ విడుదలై ఆరు నెలలు కావస్తున్నా ఇప్పటిదాకా జక్కన్న తన నెక్స్ట్ ప్రాజెక్టుపై ఏ హింట్ ఇవ్వలేదు. ఈ చిత్రానికి కథ ఓకే అయింది లేనిదీ తెలియదు. ఇందులో నటించే హీరో ఎవరన్న సమాచారమూ లేదు. దీనిపై మీడియా వాళ్లు అడుగుదామంటే రాజమౌళి దొరకట్లేదు. ఐతే రాజమౌళి సినిమాలకు కథ అందించే ఆయన తండ్రి అనుకోకుండా మీడియా ముందుకొచ్చారు. తాను కథ అందించిన ‘అదిరింది’ (మెర్శల్ తెలుగు వెర్షన్) విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన విజయేంద్రకు.. రాజమౌళి తర్వాతి సినిమా ఏంటన్న ప్రశ్న ఎదురైంది.

దానికి ఆయన బదులిస్తూ.. ‘‘విజువల్ ఎఫెక్ట్స్ అవసరం లేకుండా తీయగలిగేలా.. ఆసక్తికరమైన సామాజిక కథను సిద్ధం చేయమని రాజమౌళి నాతో చెప్పాడు. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ఈ సినిమాలో కథానాయకుడు ఎవరనే విషయం గురించి మేమైతే మాట్లాడుకోలేదు’’ అని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఇక రచయితగా తాను పని చేస్తున్న మిగతా సినిమాల గురించి మాట్లాడుతూ.. ‘‘నాయక్.. రౌడీ రాథోడ్ సినిమాలకు కొనసాగింపుగా కథలు రాస్తున్నాను. అలాగే ఆర్ ఎస్ ఎస్ నేత గోల్వాల్కర్ జీవితం ఆధారంగా ఒక కథ.. అస్సాంలో ఔరంగజేబుకు వ్యతిరేకంగా పోరాడిన లచ్చత్ బుల్బోహిత్ జీవితం నేపథ్యంలో మరో కథ రాస్తున్నాను. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మణికర్ణిక’కు కూడా కథ అందించాను’’ అని విజయేంద్ర ప్రసాద్ తెలిపాడు.
Tags:    

Similar News