తమిళ రాజకీయాల్లో కొత్త హీరో

Update: 2016-05-23 10:26 GMT
ఎగెరిగెరి పడ్డ విజయ్ కాంత్ జీరో అయిపోయాడు.. శరత్ కుమార్ పరిస్థితీ అంతే.. రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడానికి భయపడుతున్నాడు.. కమల్ హాసన్ కు అసలు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే ఉన్నట్లు కనిపించడం లేదు.. విజయ్ కు ఆశ ఉన్నట్లుంది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అయితే కుదరదు. మొత్తానికి తమిళనాట రాజకీయాల్లో సినీ హీరోల ప్రభావం నామమాత్రంగా మారిపోయేట్లే కనిపిస్తోంది. మళ్లీ ఎన్నికలు వచ్చే సమయానికి పరిస్థితి ఏమైనా మారుతుందేమో చూడాలి. ఇప్పుడైతే ఇంకే హీరో కూడా రాజకీయాల ప్రస్తావన తెచ్చే పరిస్థితి లేదు. ఐతే ఓ యువ కథానాయకుడు మాత్రం ఎన్నికలు అయిపోయాక.. ఇప్పుడు రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నాడు. ఆ హీరో మరెవరో కాదు.. కరుణానిధి మనవడు.. స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్.

పొలిటికల్ గా పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ ఉదయనిధి.. ముందు రాజకీయాలపై ఆసక్తి చూపించలేదు. సినిమాలపై దృష్టిపెట్టాడు. ముందు నిర్మాతగా అరంగేట్రం చేశాడు. తర్వాత హీరో అయ్యాడు. కానీ మనోడి ఫేస్ తమిళ జనాలకు నచ్చలేదు. క్రేజీ కాంబినేషన్లు సెట్ చేసి సినిమాలు చేశాడు కానీ.. సరైన ఫలితాలు రాలేదు. హీరోగా తనకు భవిష్యత్తు లేదని ఉదయనిధికి అర్థమైపోయినట్లుంది.. అందుకే రాజకీయాలపై దృష్టిపెడుతున్నాడు. తన తాతయ్య కరుణానిధి రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్న సమయంలో అతను రాజకీయారంగేట్రం చేయబోతుండటం విశేషం. కష్టకాలంలో ఉన్న పార్టీలో ఉత్సాహం తేవడానికి యువకుడిగా తన వంతు ప్రయత్నం చేయాలని ఉదయనిధి భావిస్తున్నాడట. త్వరలోనే అతను పార్టీ వ్యవహారాలపై దృష్టిపెడతాడట. రాజకీయ కార్యకలాపాల్లో బిజీ అవుతాడట. మరి ఈ రంగంలో అయినా విజయవంతం అవుతాడేమో8 చూద్దాం.
Tags:    

Similar News