టాలీవుడ్ డ్రగ్స్ మాఫియా కేసు ఏమైంది...?

Update: 2020-09-10 02:30 GMT
సినీ ఇండస్ట్రీని గత కొన్ని రోజులుగా డ్రగ్స్ మాఫియా వ్యవహారం హడలెత్తిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో పేలిన డ్రగ్స్ బాంబ్ ప్రభావం ఇప్పుడు సౌత్ వరకూ విస్తరించింది. ఈ క్రమంలో మూడేళ్ళ క్రితం టాలీవుడ్ లో సంచలనంగా మారిన డ్రగ్స్ కేసు ఏమైందని అందరూ నెట్టింట ఆరాలు తీస్తున్నారు. 2017లో చిత్ర పరిశ్రమలోని అనేక మంది ప్ర‌ముఖులు డ్ర‌గ్స్ యూజర్స్ గా ఉన్నారని.. డ్ర‌గ్స్ డీల‌ర్ల ద్వారా ఎవరెవరికి ప్రమేయముందనే విషయం మొత్తం బ‌య‌ట‌ప‌డింద‌ని పోలీసులు వెల్లడించారు. డ్రగ్స్ వ్యవహారంపై ఎక్సైజ్ చీఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ విచారణలో అనేక విషయాలు వెల్లడయ్యాయని వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలో టాలీవుడ్ కు చెందిన నటీనటులు దర్శకులు ఈ విచారణకు హాజరయ్యారు. అప్పట్లో టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం నిత్యం వార్తల్లో ఉండేది. డ్రగ్స్ వ్య‌వ‌హారంలో విచార‌ణ‌కు హాజ‌రైన వారి గురించి అనేక క‌థ‌నాలు వ‌చ్చాయి. వాళ్లలో డ్ర‌గ్స్ వినియోగించిన వారు ఉన్నార‌ని.. వేరే వాళ్ల‌కు డ్ర‌గ్స్ ఇచ్చిన వారు కూడా ఉన్నార‌ని రకరకాల వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఉన్నట్టుండి ఈ కేసు ఏమైందో తెలియకుండా పోయింది. ఆ కేసులో విచారించిన సినీ ప్రముఖులనెవరినీ పోలీసులు అరెస్టు చేయ‌లేదు. దీనిపై సిట్ కూడా ఎలాంటి ప్రకటన ఇచ్చినట్లుగా వార్తలు వెలువడలేదు. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ మాఫియా పై చర్చ జరుగుతున్న నేపథ్యంలో టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం కూడా వార్తల్లోకి వచ్చింది. ఆ కేసు ఏమైందని చర్చించుకుంటున్నారు.

ఇదిలా ఉండగా బాలీవుడ్ - శాండిల్ వుడ్ లలో డ్రగ్స్ కేసులో వరుస అరెస్టులు జరుగుతున్నాయి. శాండిల్ వుడ్ లో హీరోయిన్స్ రాగిణి ద్వివేది మరియు సంజనతో పాటు పలువురు డ్రగ్ డీలర్లను అరెస్ట్ చేసారు. ఇక బాలీవుడ్ లో సుశాంత్ సూసైడ్ కేసులో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తితో పాటు ఆమె సోదరుడిని అరెస్ట్ చేశారు. వీరితో పాటు కొందరు డ్రగ్ డీలర్స్ ని అరెస్ట్ చేసి వీరి నుంచి కీలక సమాచారం రాబడుతున్నారని తెలుస్తోంది. ఇలా ఇతర ఇండస్ట్రీలలో అరెస్టులు జరుగుతున్న నేపథ్యంలో టాలీవుడ్ లో ఎందుకు జరగలేదు.. ఆ డ్రగ్ కేసు ఏమైందని ఆరాలు తీస్తున్నారు.
Tags:    

Similar News