టాలెంటెడ్ శేష్.. బడ్జెట్ ఫ్రెండ్లీ స్టార్ కూడా!

సాధారణంగా ప్రయాణించడం ద్వారా కూడా పని సాఫీగా పూర్తవుతుంది" అని శేష్ పేర్కొన్నారు.;

Update: 2026-04-09 13:56 GMT

టాలీవుడ్‌ లో కంటెంట్‌ ఓరియెంటెడ్‌ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అడివి శేష్ తన పని తీరు, నిర్మాతల పట్ల బాధ్యతపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. సినిమాల బడ్జెట్‌ లు పెరుగుతున్న ప్రస్తుత కాలంలో, నటుల ఖర్చులు కూడా భారీగా పెరిగిపోతున్నాయని, ఇది నిర్మాతలపై అదనపు భారం మోపుతోందని ఆయన స్పష్టం చేశారు.

తన లేటెస్ట్ మూవీ డెకాయిట్ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన అడివి శేష్, తాను సాధ్యమైనంత వరకు నిర్మాతల ఖర్చు తగ్గించే దిశగా ఆలోచిస్తానని వెల్లడించారు. "ఇప్పుడు చాలా మంది నటులు షూటింగ్‌ కు సంబంధించిన ఖర్చుల కంటే, షూటింగ్‌ కు బయట ఉండే ఖర్చులు ఎక్కువ చేస్తున్నారు. ప్రయాణాలు, హోటల్‌ వసతులు, ఇతర లగ్జరీలు.. ఇవి నిర్మాతల బడ్జెట్‌ ను పెంచుతున్నాయి" అని శేష్ అభిప్రాయపడ్డారు.

ప్రత్యేకంగా ప్రయాణాల విషయంలో తాను ఎప్పుడూ సరళమైన విధానాన్నే అనుసరిస్తానని చెప్పారు. "హైదరాబాద్‌ నుంచి ముంబైకి వెళ్లాల్సి వస్తే, తప్పనిసరిగా బిజినెస్‌ క్లాస్‌ లోనే వెళ్లాలి అనే ఆలోచన నాకుండదు. సాధారణంగా ప్రయాణించడం ద్వారా కూడా పని సాఫీగా పూర్తవుతుంది" అని శేష్ పేర్కొన్నారు. తన కెరీర్‌ లో కీలకమైన చిత్రం అయిన గూఢచారి షూటింగ్‌ సమయంలో జరిగిన ఒక సంఘటనను ఆయన గుర్తుచేసుకున్నారు.

హిమాచల్‌ ప్రాంతంలో ఆ సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడు, సీనియర్‌ నటుడు ప్రకాష్ రాజ్ కుటుంబ సభ్యులు భద్రతా కారణాల వల్ల ఆయనతో పాటు వచ్చారని తెలిపారు. "మేము మొదటగా మూడు గదులకే బడ్జెట్‌ ప్లాన్‌ చేశాం. కానీ ఆ పరిస్థితుల్లో నాలుగు లేదా ఐదు గదులు అవసరమయ్యాయి. అప్పుడు నిర్మాతపై అదనపు భారంగా మారకుండా ఉండేందుకు నేను స్వయంగా ఒక సాధారణ లాడ్జ్‌ లో ఉండాలని నిర్ణయించుకున్నాను. రోజుకు రూ.400–రూ.500 ఖర్చుతో అక్కడే ఉండిపోయాను" అని శేష్ వివరించారు.

తనకు స్టార్‌ ఇమేజ్‌ కన్నా, సినిమా పూర్తి కావడం ముఖ్యమని ఆయన అన్నారు. "సినిమా అనేది టీమ్‌ వర్క్‌. నిర్మాత డబ్బు పెట్టి సినిమా తీస్తాడు. కాబట్టి మన వల్ల అయినంత వరకు ఆయనకు భారం తగ్గించాలి. అదే నిజమైన బాధ్యత" అని చెప్పారు. శేష్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో చర్చకు దారి తీస్తున్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ స్టార్ అంటూ నెటిజన్లు, సినీ ప్రియులు కామెంట్స్ పెడుతున్నారు.

పెద్ద బడ్జెట్‌ సినిమాలు పెరుగుతున్న ఈ సమయంలో, ఆయన కామెంట్స్ ఇండస్ట్రీకి ఒక మంచి సందేశంగా మారాయని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, హీరోగా మాత్రమే కాకుండా బాధ్యత గల టీమ్‌ ప్లేయర్‌ గా అడివి శేష్ కనిపిస్తున్నారు. నిర్మాతలపై ఆర్థిక ఒత్తిడి తగ్గించే దిశగా ఉన్న ఆయన కామెంట్స్.. ప్రస్తుత జనరేషన్ కు ఆదర్శమనే చెప్పాలి.

Tags:    

Similar News