ఎంజీఎం ఆసుపత్రి వద్ద ఉద్విగ్నం.. ఒక్కొక్కరుగా వస్తున్న ప్రముఖులు

Update: 2020-09-25 05:45 GMT
గడిచిన కొన్ని రోజులుగా కరోనాతో పోరాడిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం గురించి ఆవేదన చెందని తెలుగువాడు లేడంటే అతిశయోక్తి కాదు. ఆయన త్వరగా కోలుకోవాలని.. ఆయన నోటి మాటలు వినాలని తపిస్తున్నారు. ఇలాంటివేళ.. ఆయన కోలుకుంటున్నట్లుగా వార్తలు రావటంతో అంతా హమ్మయ్య అనుకుంటున్న పరిస్థితి. ఇదిలా ఉండగా.. గురువారం మధ్యాహ్నం నుంచి ఆయన మరోసారి ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నట్లుగా వార్తలు వచ్చాయి.

రాత్రి అయ్యేసరికి ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. కాసేపటికే పరిస్థితి విషమంగా ఉందని.. వెంటిలేటర్ల మీద వైద్యం చేస్తున్నట్లుగా పలు చానళ్లు పేర్కొన్నాయి. బాలు వద్దనే ఆయన కుమారుడు చరణ్ ఉన్నారని.. కుటుంబ సభ్యులు ఆయనకు వైద్య సేవలు అందిస్తున్న ఎంజీఎం ఆసుపత్రి వద్దకు చేరుకున్నట్లుగా పేర్కొన్నారు.

బంధువులు.. సన్నిహితులు.. సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఒక్కక్కరుగా ఆసుపత్రి వద్దకు చేరుకోవటంతో ఉద్విగ్న వాతావరణం చోటు చేసుకుంది. ఏ నిమిషాన ఏ వార్త వినాలన్న ఆందోళనలో ఆయన అభిమానులు మునిగిపోయారు. అర్థరాత్రి సమయం వరకు పలువురు ప్రముఖులు ఎంజీఎంకు వచ్చి బాలు కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు.

వైద్యులు వెల్లడించే తాజా బులిటెన్ లో ఆయన తాజా ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. తెలుగు ప్రజలు మాత్రమే కాదు.. ఆయన గానం పరిచయం ఉన్న ప్రతి ఒక్కరి విన్నపం ఇప్పుడు ఒక్కటే.. దేవుడా.. మా గాన గంధర్వుడ్ని త్వరగా కోలుకునేలా చేయ్ అని. కోట్లాది మంది విన్నపాన్ని దేవుడి ఏం చేస్తాడో చూడాలి.
Tags:    

Similar News