కన్నడ సినిమాలో ఇంత తెలుగుదనమా!

Update: 2016-10-07 05:13 GMT
సౌత్ ఇండియాలో అత్యంత ఆసక్తి రేకెత్తించిన డెబ్యూ హీరో మూవీస్ లో ఒకటైన ‘జాగ్వార్’ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఏకంగా రూ.75 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఇది. నిఖిల్ కుమార్ తో మన ప్రేక్షకులకు ఏ కనెక్షన్ లేకపోయినా ఈ చిత్రాన్ని ఒకేసారి కన్నడతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేశారు. ‘జాగ్వార్’ను ద్విభాషా చిత్రంగా చేయమన్న కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ మాటను కుమారస్వామి అండ్ కో ఎంతగా గౌరవించిందో ఈ సినిమా చూస్తే అందరికీ అర్థమైంది. హీరో హీరోయిన్ల సంగతి పక్కనబెట్టేస్తే.. అసలు ‘జాగ్వార్’ చూస్తుంటే ఇది వేరే భాషకు చెందిన సినిమాలా అనిపించదు. ఈ సినిమా అంతటా తెలుగు నటీనటులు.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న యాక్టర్సే కనిపించారు.

హీరో తండ్రిగా నటించింది రావు రమేష్ అయితే.. కీలకమైన సీబీఐ ఆఫీసర్ పాత్ర పోషించింది జగపతిబాబు. జగపతి దగ్గర అసిస్టెంట్ పాత్రలో కనిపించింది రఘుబాబు. తర్వాత బ్రహ్మానందం కూడా ఓ కామెడీ రోల్ చేశాడు. మరో కీలకమైన పాత్రలో ఆదర్శ్ బాలకృష్ణ కనిపించాడు. హీరో తల్లి పాత్రలో రమ్యకృష్ణ కనిపించింది. తెలుగులో అవకాశాలు తగ్గిపోయిన సుప్రీత్ కూడా ఓ రోల్ చేశాడు. ఇంకా ఆదిత్య మీనన్.. సంపత్ లాంటి వాళ్లు కూడా మన ప్రేక్షకులకు బాగా పరిచయమున్న నటులే. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగతి చెప్పాల్సిన పని లేదు. కెమెరామన్ మనోజ్ పరమహంస కూడా మనకు పరిచయస్తుడే. ఇక కథ విజయేంద్ర ప్రసాద్ రాస్తే.. దర్శకత్వం ‘మిత్రుడు’ ఫేమ్ మహదేవ్ చేశాడు.  ఇదంతా చాలదన్నట్లు మెగాస్టార్ వీణ స్టెప్.. పవన్ కళ్యాణ్ ‘కెవ్వు కేక’ రెఫరెన్సులు కూడా ఉన్నాయి. మొత్తానికి తెలుగు ప్రేక్షకులు కనెక్టయ్యేలా చేయడానికి చాలా ప్రయత్నాలే జరిగాయి. కానీ ఇంత చేసినా.. తెలుగు ప్రేక్షకులకు మొహం మొత్తేసిన కథాకథనాల్ని ఎంచుకోవడంతోనే వచ్చింది సమస్య.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News