ఇంతకీ ఆ అవార్డులెప్పుడు?

Update: 2017-03-02 07:20 GMT
ఎవ్వరూ ఊహించని విధంగా 2012.. 2013 సంవత్సరాలకు ఇప్పుడు నంది అవార్డులు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ సినిమాలు వచ్చి నాలుగైదేళ్లు అయిపోవడంతో ఎవరికీ పెద్దగా ఎగ్జైట్మెంట్ లేదు. అందుకే ఒకప్పట్లా ఈ అవార్డుల గురించి పెద్దగా చర్చ జరగట్లేదు. నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డుల్ని పునరుద్ధరిస్తుందని.. అవార్డులు ప్రకటిస్తుందని కూడా కొన్ని నెలల కిందటి వరకు ఎవరికీ నమ్మకం లేదు. ఐతే తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ‘సింహా’ పేరుతో అవార్డులు ప్రకటించాలని నిర్ణయించడం.. అందుకోసం కమిటీని కూడా ఏర్పాటు చేయడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. చకచకా ఈ ప్రక్రియ పూర్తి చేసి అవార్డులు ప్రకటించేసింది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టీ సింహా అవార్డుల మీద పడింది. ఇక ఈ అవార్డులు ఎప్పుడిస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ అవార్డులకు ఏ సంవత్సరం నుంచి సినిమాల్ని పరిగణనలోకి తీసుకుంటారన్నది ఆసక్తికరం. బహుశా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది 2014లో కాబట్టి అప్పట్నుంచి లేదా.. లేదా ఆ తర్వాతి ఏడాది నుంచి అవార్డుల ప్రకటన ఉంటుందేమో. తెలంగాణ ప్రభుత్వం ఏదో ఒక సంవత్సరానికి సింహా అవార్డుల్ని ప్రకటించాక.. అదే సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులను కూడా ప్రకటించాల్సి ఉంటుంది కాబట్టి ఎవరు ఏ కేటగిరికి ఎవరికి అవార్డులు ఇస్తారో చూడాలి. ఇక్కడో సినిమా.. అక్కడో సినిమా ‘బెస్ట్’ కేటగిరికి ఎంపికైతే దాని మీద పెద్ద చర్చే ఉంటుంది. ఒకే సినీ పరిశ్రమకు చెందిన రెండు కమిటీల అభిప్రాయాలు ఎంతవరకు కలుస్తాయి.. ఎంత వైరుధ్యంగా ఉంటాయి.. ఎవరి ప్రయారిటీస్ ఎలా ఉంటాయి.. అన్నది కూడా గమనించదగ్గ విషయమే. మరి తెలంగాణ ప్రభుత్వం ‘సింహా’ అవార్డుల్ని ఎప్పుడు ప్రకటిస్తుందో మరి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News