పేరుకు పెద్ద నిర్మాత చేసేవన్నీ రీమేక్‌ లే

Update: 2020-04-23 01:30 GMT
టాలీవుడ్‌ లో పెద్ద నిర్మాతల జాబితా తీస్తే అందులో ముందు వరుసలో ఉండే నిర్మాత సురేష్‌ బాబు. నిర్మాతగానే కాకుండా డిస్ట్రిబ్యూటర్‌ గా కూడా తెలుగు సినిమా పరిశ్రమలో పెద్ద తలకాయగా సురేష్‌ బాబు ఉంటారు. పెద్ద ఎత్తున థియేటర్లు సురేష్‌ బాబు ఆధీనంలో ఉంటాయనే ప్రచారం కూడా ఉంది. వందల కోట్ల పెట్టుబడితో సినిమాలు నిర్మించగల సత్తా ఉన్న నిర్మాత సురేష్‌ బాబు. కాని ఆయన చాలా తెలివిగా చిన్న చిన్న సినిమాలను మాత్రమే నిర్మిస్తున్నారు. అది కూడా ఆయన ఇతర నిర్మాతలతో కలిసి నిర్మాణ భాగస్వామ్యంతో సినిమాలు నిర్మిస్తున్నారు.

రానా.. గుణశేఖర్‌ ల కాంబినేషన్‌ లో వంద కోట్ల బడ్జెట్‌ తో హిరణ్య కశ్యప చిత్రాన్ని చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చినా కూడా అది ఇంత వరకు కార్యరూపం దాల్చడం లేదు. ఇక తాజాగా సురేష్‌ బాబు ఒక ఇంటర్వ్యూలో ప్రస్తుతం తన బ్యానర్‌ లో రూపొందుతున్న సినిమాల గురించి పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక సినిమా నిర్మాణంలో ఉంది.. మరో రెండు సినిమాలు నిర్మించబోతున్నట్లుగా సురేష్‌ బాబు పేర్కొన్నారు. ఆ మూడు సినిమాలు కూడా రీమేక్‌ లే అంటూ ఆయన చెప్పారు.

వెంకటేష్‌ తో ప్రస్తుతం అసురన్‌ ను ‘నారప్ప’ గా రీమేక్‌ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ రీమేక్‌ షూటింగ్‌ మరో మూడు వారాలు షూట్‌ చేస్తే పూర్తి అవ్వనుంది. ఆ తర్వాత రెండు హిందీ సినిమాలను రీమేక్‌ చేయబోతున్నట్లుగా పేర్కొన్నారు. డ్రీమ్‌ గర్ల్‌ ఇంకా సోనూ కి టిటూ కి షాదీ సినిమాల రీమేక్‌ రైట్స్‌ ను సురేష్‌ బాబు దక్కించుకున్నారట. ప్రస్తుతం ఈ రెండు రీమేక్‌ లకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ లు జరుగుతున్నాయని అన్నారు. ఇవే కాకుండా పలు చిన్న సినిమాలను ఇతర నిర్మాతలతో కలిసి నిర్మిస్తున్నట్లుగా కూడా పేర్కొన్నారు.

ఇండస్ట్రీలో పెద్ద నిర్మాత అయిన సురేష్‌ బాబు డైరెక్ట్‌ సినిమాలను చేసేందుకు ఆసక్తి చూపించకుండా ఇప్పటి వరకు పలు రీమేక్‌ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.. ఇకపై కూడా రీమేక్‌ లతోనే సురేష్‌ బాబు ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేయాలనుకుంటున్నారు. తెలుగులో ఎంతో మంది రచయితలు ఉన్నారు.. యంగ్‌ డైరెక్టర్స్‌ కొత్త కొత్త కాన్సెప్ట్‌ లతో రెడీగా ఉన్నారు. అయినా కూడా సురేష్‌ బాబు మాత్రం రీమేక్‌ లనే నమ్ముతున్నారంటూ ఒక వర్గం వారు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.

పేరుకు పెద్ద నిర్మాత అయ్యి ఉండి ఇలా చిన్న నిర్మాతల మాదిరిగా రీమేక్స్‌ చేయడం ఏంటీ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈమద్య కాలంలో సురేష్‌ బాబు సాహసంతో భారీగా ఖర్చు పెట్టి ఏ ఒక్క సినిమా నిర్మించలేదంటూ నెటిజన్స్‌ ఆరోపిస్తున్నారు. సురేష్‌ బాబు కేవలం రీమేక్‌ లకే ప్రాముఖ్యత ఇవ్వడంకు కారణం ఏంటో చెప్పాలి.
Tags:    

Similar News