అప్పుడు సూపర్ స్టార్ ఓకే అనుంటే ఇప్పుడు వెంకీ ఎక్కడుండేవాడో...?

Update: 2020-04-22 09:50 GMT
టాలీవుడ్ లో ఇప్పుడున్న నలుగురు సీనియర్ హీరోలలో విక్టరీ వెంకటేశ్ కి ప్రత్యేక స్థానం ఉంది. తన స్టార్ డమ్ ఇమేజ్ లను పక్కన పెట్టి మంచి కథాబలం ఉండే సినిమాలకు ప్రాధాన్యతనిస్తాడు. మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయమైనా.. ఒక సక్సెస్‌ ఫుల్ హీరోగా ఎదగడానికి చాలానే కష్టపడ్డాడు. అయితే వెంకటేష్ సినీ ఇండస్ట్రీలో ఎంటర్ అవడం సినిమాటిక్ గా జరిగిందట. డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యారు అన్నట్లు.. బిజినెస్ మ్యాన్ అవ్వబోయి యాక్టర్ అయ్యారట విక్టరీ వెంకటేష్. రామానాయుడు ఇద్దరు కుమారులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని అనుకున్నారట. అందుకే వీరిద్దరిని విదేశాలలో ఉన్నతమైన చదువులు చదివించారు.

ఈ నేపథ్యంలో సురేష్ బాబు సొంతగా ఓ ఫ్యాక్టరీ స్థాపించారట. అది అంతగా అభివృద్ధిలోకి రాకపోవడంతో తండ్రితో పాటు మూవీ నిర్మాణ బాధ్యతలు చూసుకుంటూ ఉండేవారట. అయితే వెంకటేష్ ని కూడా మూవీ నిర్మాతగా లేదా వ్యాపార వేత్తగా చూడాలని రామానాయుడు ఆశించారట. అందుకే ఆయన చేత యూఎస్ లో ఎమ్.బి.ఏ చేయించారట. అయితే వెంకటేష్ హీరోగా మారడం నాటకీయంగా జరిగింది. 'కలియుగ పాండవులు' మూవీ సూపర్ స్టార్ కృష్ణతో చేయాలని రామానాయుడు - డైరెక్టర్ రాఘవేంద్ర రావు నిర్ణయించుకున్నారట. ఈ విషయమై కృష్ణ తో మాట్లాడగా ఈ మూవీ సహ నిర్మాతగా ఏఎస్ ఆర్ ఆంజనేయులిని తీసుకోవాలని సూచించారట. దీనికి రామానాయుడు ఒప్పుకోలేదట. దానితో రామానాయడు మరో హీరో కోసం వెతుకుతుండగా సన్నిహితులు.. మీ చిన్నబ్బాయి హ్యాండ్ సమ్ గా ఉన్నారు…హీరోగా చక్కగా సరిపోతాడు అని సలహా ఇచ్చారట. అలా వెంకటేష్ 'కలియుగ పాండవులు' సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమయ్యారట. హిందీలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న కుష్బూ ని ఈ సినిమాతోనే టాలీవుడ్ కి పరిచయం చేసారు.

వెంకటేష్ తొలి సినిమా 'కలియుగ పాండవులు' సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో వెంకటేష్ హీరోగా.. సురేష్ బాబు నిర్మాతగా స్థిరపడిపోయారు. కెరీర్ స్టార్టింగ్ నుండి తనదైన శైలిలో సినిమాలను చేస్తూ.. తన 30 ఏళ్ల సినీ కెరీర్‌లో ఎన్నో సినిమాలలో నటించిన వెంకటేష్ ఎన్నో అవార్డులను కైవసం చేసుకొని ఎన్నో రికార్డులనే తిరగరాసి 'విక్టరీ' వెంకటేష్ గా మారిపోయారు. అంటే 'కలియుగ పాండవులు' సినిమా కృష్ణ తో చేసి ఉంటే ఇప్పుడు వెంకటేష్ ఏ బిజినెస్ మ్యాన్ గానో.. ప్రొడ్యూసర్ గానో ఉండేవాడన్నమాట.
Tags:    

Similar News