ఔను.. వైరముత్తు అలాంటోడే : మరో సింగర్‌

Update: 2018-10-20 09:21 GMT
తమిళ సినిమా పరిశ్రమ మొత్తం లెజెండ్‌ అంటూ గౌరవించే వైరముత్తు పై తాజాగా గాయని చిన్మయి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఆయన తనపై పదేళ్ల క్రితం లైంగిక దాడికి ప్రయత్నించాడని - అమెరికాలో తనను ఆయన గదిలోకి రమన్నాడు అంటూ ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. తనపై మాత్రమే కాకుండా తనకు తెలిసిన పలువురు గాయనిలపై కూడా ఆయన లైంగిక దాడికి ప్రయత్నించాడంటూ ఆమె ఆరోపించింది. ఎంతో మంది మీడియా ముందుకు వచ్చి చెప్పేందుకు భయపడుతున్నారని, ఆయన గురించి వారు నా వద్ద చెప్పిన విషయాలను మీడియాకు చెబుతున్నానంటూ చిన్మయి సంచలన వ్యాఖ్యలు చేసింది.

వైరముత్తు పై చిన్మయి చేసిన ఆరోపణలపై స్పందించేందుకు తమిళ సినిమాకు చెందిన ప్రముఖులు ఆసక్తి చూపడం లేదు. మరి కొందరు మాత్రం ఇన్నాళ్లు సైలెంట్‌ గా ఉండి, ఇప్పుడెందుకు ఆయన్ను టార్గెట్‌ చేసి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కొందరు చిన్మయిని విమర్శిస్తున్నారు. ఈ సమయంలోనే మెల్ల మెల్లగా చిన్మయికి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే సింగర్‌ సిందూజా రాజారాం వైరాముత్తపై ఆరోపణలు చేసింది. చిన్మయి చెప్పిన దాంట్లో నిజం ఉందని పేర్కొంది.

తాజాగా ప్రముఖ దివంగత గాయకుడు వాసుదేవన్‌ కోడలు - గాయని హేమ మాలిని వైరముత్తు గురించి సంచలన వ్యాఖ్యలు చేసి - చిన్మయికి మద్దతుగా నిలిచింది. చిన్మయి చెబుతున్నట్లుగా వైరముత్తు అటువంటి వ్యక్తే - అంతా భావిస్తున్నట్లుగా ఆయన సచ్చీలుడు ఏమీ కాదని ఫేస్‌ బుక్‌ లో పోస్ట్‌ చేసింది. వైరముత్తుపై చిన్మయి విమర్శలు చేస్తే - అందులో నిజా నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయకుండా - ఇన్నాళ్లు ఏం చేశావంటూ చిన్మయినే విమర్శించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. చిత్ర పరిశ్రమ మొత్తం కూడా వైరముత్తుకు మద్దతుగా నిలుస్తుందని ఆమె ఆరోపించింది. గతంలో తాను ఒక ప్రైవేట్‌ ఛానెల్‌ లో వర్క్‌ చేస్తున్న సమయంలో అక్కడ యాంకర్‌ తో వైరముత్తు అసభ్యంగా ప్రవర్తించాడు. ఆయన గురించి గతంలో తాను పలు సార్లు మాట్లాడాను - కాని అది ఎప్పుడు కూడా బయటకు రాలేదని - ఆయనకు తమిళ సినిమా పరిశ్రమలో ఉన్న గౌరవం అటువంటిదని హేమమాలిని అన్నారు.

Tags:    

Similar News