కరీంనగర్ లో చేసిన పని బెజవాడలో చేస్తే పోలీసులు అడ్డుకున్నారు

Update: 2020-10-06 11:10 GMT
సినీ నటుడు..కమ్ టీవీ నటుడు షకలక శంకర్ కు చేదు అనుభవం ఎదురైంది. ఒక మంచి పని చేసేందుకు వెళ్లిన అతడ్ని విజయవాడ పోలీసులు అడ్డుకోవటమే కాదు.. తమ మాట వినకుండా కేసు పెడతామని హెచ్చరించటంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇంతకూ షకలక శంకర్ ఏం చేశారు? విజయవాడకు ఆయన ఎందుకు వెళ్లినట్లు? అన్న వివరాల్లోకి వెళితే..

కరోనా నేపథ్యంలో ఎంతో మందికి ఉపాధి పోయి కష్టాలు పడుతున్న పరిస్థితి. ఇలాంటివేళ.. కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకునేందుకు వీలుగా ఇటీవల కరీంనగర్ లో విరాళాలు సేకరించారు. దాదాపు రూ.90వేలు కలెక్టు కాగా.. దానికి తన వంతుగా రూ.10వేలు జోడింది రూ.లక్ష మొత్తాన్ని కొందరికి దానంగా ఇచ్చారు. ఇదే తీరులో తాజాగా బెజవాడలో విరాళాల్ని సేకరించే కార్యక్రమాన్ని నిర్వహించారు.

విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద విరాళాలు సేకరిస్తున్న షకలక శంకర్ ను పోలీసులు అడ్డుకున్నారు. కరోనా టైంలో ఇలాంటి వాటికి తాము అనుమతి ఇవ్వలేమన్నారు. తాను ఇటీవల కరీంనగర్ లో విరాళాలు సేకరించామని.. పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయలేదని చెప్పినా.. వారు ఊరుకోలేదు. దీంతో.. తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఉపాధి పోయిన వారిని ఆదుకోవాలన్నదే తన లక్ష్యమని.. అందుకు సహకరించాల్సిన పోలీసులు.. ఇలా అడ్డుకోవటం ఏమిటంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా కరీంనగర్ లో ఓకే అయ్యింది బెజవాడలో కాదా? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News