లీక్‌లపై దళపతి మౌనం..కారణం ఏంటీ?
కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ కథానాయకుడిగా నటించిన చివరి సినిమా 'జన నాయగన్'.;
కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ కథానాయకుడిగా నటించిన చివరి సినిమా 'జన నాయగన్'. తెలుగు హిట్ ఫిల్మ్ 'భగవంత్ కేసరి' ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా లీక్ వ్యవహారం ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై ప్రముఖ హీరోలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయ్‌కి అండగా తామున్నామంటూ ముందుకొస్తున్నారు. సినిమా విడుదలకు ముందే కొన్ని సీన్‌లు లీక్‌కు గురి కావడం ఆందోళన కలిగిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి, మోహన్‌బాబు, సూర్య, కార్తి, శివకార్తికేయన్, మంచు విష్ణు 'జన నాయగన్' లీకులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వార్త విని తీవ్ర ఆందోళనకు గురయ్యానని, యావత్ చలన చిత్ర పరిశ్రమకు వ్యతిరేకంగా జరిగిన సిగ్గుమాలిన చర్య ఇదని పలువురు స్టార్లు ఫైర్ అయ్యారు. తాజాగా కమల్ హాసన్ కూడా స్పందించి ఇది వ్యవస్థ వైఫల్య ఫలితమన్నారు. సకాలంలో దీనికి సంబంధించిన పనులు జరిగి ఉంటే ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సినిమా లీకులపై కోలీవుడ్ టు టాలీవుడ్ వరకు స్టార్స్ స్పందిస్తూ విజయ్‌కి అండగా నిలుస్తుంటే తను మాత్రం దీనిపై స్పందించకపోవడం, అడిగినా సరే స్పందించడానికి ఇష్టపడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. శివగంగై జిల్లా కారైక్కుడిలో ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం హీరో విజయ్ చెన్నై చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయనని మీడియా 'జన నాయగన్' లీకులపై ప్రశ్నించింది. దీనిపై స్పందించకుండా విజయ్ అక్కడి నుంచి వెళ్లిపోవడం అందరిని షాక్‌కు గురి చేసింది.
సినిమా రిలీజ్ విషయంలో సెన్సార్ ఇబ్బందులు ఎలా మొదలయ్యాయి? దాని వెనుకు ఎవరున్నారో వివరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన విజయ్ తాజాగా లీకుల గురించి మాత్రం మౌనం పాటించడం ఏంటనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. మిగతా స్టార్లు స్పందిస్తూ లీకులని కండిస్తుంటే విజయ్ మాత్రం మౌనంగా వెళ్లిపోవడం ఏంటని అభిమానులు అవాక్కవుతున్నారట.
ముందు ఈ సినిమాని జనవరి 9న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. దీనికి కోసం భారీగా తమిళ, తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాట్లు చేశారు. అయితే సెన్సార్ వివాదం కారణంగా ఈ సినిమా రిలీజ్ చివరి నిమిషంలో వాయిదా పడింది. అక్కడి నుంచి సెన్సార్‌పై మేకర్స్ చెన్నై కోర్టుని ఆశ్రయించడం.. ఆతరువాత జరిగిన నాటకీయ పరిణామాల కారణంగా సినిమా రిలీజ్ నెలల తరబడి వాయిదా పడుతూ వస్తూనే ఉంది. ఫైనల్‌గా లీకులు మొదలవడంతో అభిమానుల్లో భయాందోళనలు వ్యక్తమవుతుండటం గమనార్హం.