శ‌ర‌ణార్థుల జీవితాల‌పై షారూక్-హిరాణీ భారీ ప్ర‌యోగం?

Update: 2021-08-25 12:30 GMT
బాలీవుడ్ సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రాజ్ కుమార్ హిరాణీ మున్నాభాయ్ సిరీస్ త‌ర్వాత పీకే.. సంజు లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించారు. సంజ‌య్ ద‌త్ - అమీర్ ఖాన్ - ర‌ణబీర్ వంటి హీరోల‌తో సెన్సేష‌న్స్ ఆయ‌న‌కు కొత్తేమీ కాదు కానీ ఇప్పుడు మ‌రో అగ్ర క‌థానాయ‌కుడిగా భారీ ప్ర‌యోగానికి ఆయ‌న స‌న్నాహ‌కాల్లో ఉన్నారు.

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ - దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ కొత్త ప్రాజెక్ట్ ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ కాంబినేష‌న్ గురించి చాలా కాలంగా మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం స్క్రిప్టింగ్ పనులను పూర్తి చేసారని తెలిసింది.

బాలీవుడ్ వర్గాల క‌థ‌నం ప్రకారం.. హిరాణీ అతని రచనా భాగస్వామి కనికా ధిల్లాన్ ఇటీవల స్క్రిప్ట్ ను పూర్తి చేసారు. ఇంతకుముందు హిరాణీ షారూఖ్ కి మరో కథను వివరించారు. కానీ దానిలో రెండవ భాగం ఆశించినంత బాగా లేనందున మేకర్స్ కొత్త క‌థ‌పై పనిచేశారు. కొత్త స్క్రిప్ట్ షార‌క్ కి న‌చ్చింది. త్వ‌ర‌లోనే కాస్టింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించనున్నార‌ని తెలిసింది. హిరాణీ ఆస్థాన ఏజెంట్ ముఖేష్ ఛబ్రా క్యాస్టింగ్ పనులను చూస్తున్నారు. ఈ చిత్రంలో తాప్సీ పన్నూ క‌థానాయిక‌గా న‌టించేందుకు ఆస్కారం ఉంద‌ని తెలిసింది. సినిమా క‌థాంశం ఆస‌క్తికరం. వలసదారుల నేపథ్యంలో సాగే సామాజిక డ్రామా ఇది. ఈ చిత్రం చాలా భాగం కెనడాలో తెర‌కెక్క‌నుంది. పేరులేని ఈ ప్రాజెక్ట్ షూటింగ్ 2022 లో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం SRK తన త‌దుప‌రి చిత్రం పఠాన్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అతను త్వరలో అట్లీ దర్శకత్వం వహిస్తున్న మరో ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభిస్తాడు. ఆ త‌ర్వాత రాజ్ కుమార్ హిరాణీతో సెట్స్ పైకి వెళ‌తారు.

కింగ్ ఖాన్ ప‌ఠాన్ తో కంబ్యాక్ అవుతారా?

వ‌రుస ప‌రాజ‌యాలు కింగ్ ఖాన్ ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ ప‌రాజ‌యాలు అతడి ఉనికినే షేక్ చేశాయంటే అతిశ‌యోక్తి కాదు. ఆయన ఎంత బాద్ షా అయినా వ‌రుస ఫ్లాపులు మార్కెట్ వ‌ర్గాల్లో క‌ల్లోలానికి కార‌ణ‌మయ్యాయి. అందుకే ఖాన్ పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఏదైనా సినిమాకి సంత‌కం చేయాలంటేనే ఎంతో ఆలోచించి ఆచితూచి అడుగులేశారు. ఏళ్ల త‌ర‌బ‌డి గ్యాప్ తీస్కున్నారు.

`పఠాన్` చిత్రం నాలుగేళ్ల గ్యాప్ తో ప్రారంభించారు. ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. యష్ రాజ్ క్యాంప్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో జాన్ అబ్రహం విల‌న్ పాత్ర‌ను పోషిస్తుండడం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. SRK వ‌ర్సెస్ జాన్ ఎపిసోడ్స్ ని దుబాయ్ లో చిత్రీకరించ‌గా అవి హైలైట్ గా నిలుస్తాయ‌ని తెలుస్తోంది. కొన్ని నెలల్లో షూటింగ్ కోసం రద్దీగా ఉండే రోడ్లు భవనాలను యష్ రాజ్ బ్యాన‌ర్ లాక్ చేసి ఇటీవ‌ల భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల్ని తెర‌కెక్కంచారు. ఈ చిత్రంలో దీపికా పదుకొనే క‌థానాయిక‌గా న‌టిస్తోంది.



Tags:    

Similar News