మెగాస్టార్ ఆఫర్ ని తిరస్కరించాడా..?

Update: 2021-08-18 15:00 GMT
మ‌ల‌యాళం బ్లాక్ బాస్ట‌ర్ హిట్ అయిన 'లూసిఫ‌ర్' చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవలే సెట్స్ మీదకు వెళ్ళింది. ప్రస్తుతం హైదరాబాద్ లో కీలకమైన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. మాతృకలో మోహ‌న్ లాల్ పోషించిన పాత్ర‌లో చిరు కనిపించనున్నారు. అయితే ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ కీలక పాత్ర చేయనున్నారని గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి.

'లూసిఫ‌ర్' డైరెక్టర్ పృథ్విరాజ్ సుకుమార‌న్ ఈ చిత్రంలో గెస్ట్ రోల్ చేశారు. నిడివి తక్కువ అయినా కథలో ప్రాధాన్యత ఉన్న పాత్ర అది. ఇప్పుడు అదే పాత్ర కోసం సల్మాన్ ఖాన్ ను చిరంజీవి అండ్ టీమ్ సంప్రదించారనే న్యూస్ బయటకు వచ్చింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా చేయాలనే ఆలోచనలో సల్లూ భాయ్ ని ఇందులో నటింపజేయాలని భావించారని టాక్ వచ్చింది. చిరు - చరణ్ లతో ఉండే సాన్నిహిత్యంతో సల్మాన్ ఖాన్ ఇందులో నటించడానికి అంగీకరించారని అన్నారు.

అయితే బీ టౌన్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం చిరు ఆఫర్ ను సల్మాన్ సున్నితంగా తిరస్కరించారని తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజం కాకపోతే.. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న సల్మాన్ ఖాన్.. #Chiru153 కోసం డేట్స్ కేటాయించగలరా లేదా అనేది కూడా అనుమానమే. ఈ నేపథ్యంలో మాతృకలో పృథ్వీరాజ్ చేసిన పాత్ర కోసం ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ని సంప్రదిస్తున్నారని మరో రూమర్ చక్కర్లు కొడుతోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.

కాగా, #Chiru153 చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ - సూపర్ గుడ్ ఫిలిమ్స్ - ఎన్వీఆర్ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్.ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఓ సాంగ్ రికార్డింగ్ పూర్తి చేశారు. నిరవ్‌ షా సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సురేశ్ సెల్వరాజన్‌ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. స్టంట్‌ మాస్టర్ సిల్వ యాక్షన్‌ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ''గాడ్ ఫాదర్'' అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది చిరంజీవి చిత్రానికి సరైన టైటిల్ అని మెగా అభిమానులు భావిస్తున్నారు. మెగా రీమేక్ కు సంబంధించిన మరిన్ని వివరాలు మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 22న తెలిసే అవకాశం ఉంది.
Tags:    

Similar News