రామ్ నెక్స్ట్.. సైలెంట్ గా వర్క్ చేస్తున్నారా?

టాలీవుడ్ యంగ్ హీరో, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రీసెంట్ గా ఆంధ్రా కింగ్ తాలూకా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.;

Update: 2026-01-24 12:19 GMT

టాలీవుడ్ యంగ్ హీరో, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రీసెంట్ గా ఆంధ్రా కింగ్ తాలూకా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పి.మహేష్ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. గత ఏడాది నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన మూవీ.. రామ్ కు నిరాశ మిగిల్చింది. భారీ హిట్ అందుకుంటారని అంతా అనుకుంటే అలా జరగలేదు.

నిజానికి రామ్.. ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. కెరీర్‌ లో ఇప్పటివరకు ఎప్పుడూ లేనంతగా ఆ ప్రాజెక్ట్‌ ను సీరియస్‌ గా తీసుకున్నారు. కథా ఎంపిక దగ్గర నుంచి స్క్రిప్ట్ డెవలప్పింగ్ వరకు ప్రతి స్టేజ్ లో కూడా స్వయంగా చొరవ తీసుకున్నారు. కొన్ని పాటలకు ఆయన స్వయంగా సాహిత్యం అందించగా, సినిమా ప్రమోషన్లలో కూడా పూర్తి స్థాయిలో పాల్గొన్నారు.

సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో సినిమా వసూళ్లు రాబట్టలేకపోయింది. దీంతో మూవీ కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు. ఆడియన్స్ నుంచి మంచి స్పందన ఉన్నా కూడా థియేటర్లలో సినిమా నిలబడకపోవడం టాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఆంధ్రా కింగ్ తాలూకా షూటింగ్ సమయంలోనే తన అప్ కమింగ్ మూవీని రామ్ జనవరిలోనే క్రితం ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. సంక్రాంతి సందర్భంగా అప్డేట్ ఇస్తారని టాక్ వినిపించింది. జనవరి 14వ తేదీన సినిమాను అనౌన్స్ చేసి.. ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని అనుకున్నారట. కానీ ఇప్పుడు ఆంధ్రా కింగ్ తాలూకా రిజల్ట్ తర్వాత రామ్ ప్లాన్ మార్చుకున్నట్లు తెలుస్తోంది.

అదేంటంటే.. ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా తర్వాత రామ్.. కిషోర్ అనే కొత్త డైరెక్టర్ తో వర్క్ చేసేందుకు సిద్ధమయ్యారు! ఇప్పటికే స్క్రిప్ట్ పై చర్చలు కూడా జరిగిపోయాయి. రామ్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు అందులో మార్పులు చేర్పులు చేస్తున్నారట. స్క్రిప్ట్‌ ను మరింత మెరుగుపరిచే పనిలో రామ్ బిజీగా ఉన్నారని సమాచారం. ఫుల్ ఫోకస్ పెట్టి.. సైలెంట్ గా పని కానిస్తున్నారని టాక్.

అదే సమయంలో ఓవైపు ఆ స్క్రిప్ట్ వర్క్ ను చూసుకుంటూనే.. మరో వైపు నిర్మాతగా ఓ సినిమాను నిర్మించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ కు చెందిన ఓ టాప్ ప్రొడక్షన్ హౌస్ తో కలిసి రూపొందించనున్నారని సమాచారం. ఆ మూవీకి కథను రామ్ అందించనున్నారని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అలా ప్రస్తుతం అటు నటుడిగా చేయాల్సిన సినిమా కోసం.. ఇటు నిర్మాతగా చేయనున్న మూవీ కోసం రామ్ వర్క్ చేస్తున్నారని వినికిడి.

Tags:    

Similar News