‘ధోని’ ముందు ‘సచిన్’ నిలవలేకపోయాడే..

Update: 2017-05-28 07:12 GMT
మన దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక అభిమానులున్న క్రికెటర్ ఎవరు అంటే మరో మాట లేకుండా సచిన్ టెండూల్కర్ పేరు చెప్పేయొచ్చు. సచిన్ తర్వాత ధోని.. విరాట్ కోహ్లి లాంటి స్టార్లు కూడా తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకుని ఉండొచ్చు. కానీ సచిన్ మీద అభిమానం వేరు. ఈ నేపథ్యంలోనే క్రికెట్ దేవుడి మీద తీసిన ‘సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్’ సినిమాకు ఆదరణ ఏ స్థాయిలో ఉంటుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఐతే ఈ సినిమా తొలి రోజు ఓ మోస్తరుగా మాత్రమే ప్రేక్షకుల్ని ఆకర్షించింది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం దేశవ్యాప్తంగా రూ.8.4 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసింది.

గత ఏడాది ధోని మీద తీసిన ‘ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ’ తొలి రోజు దేశవ్యాప్తంగా రూ.20 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. దాంతో పోలిస్తే సచిన్ సినిమా వసూళ్లు బాగా తక్కువే. ఐతే ఇక్కడ ధోని సినిమాకు.. సచిన్ సినిమాకు ఉన్న వైరుధ్యాన్ని గమనించాలి. ‘ధోని’ పూర్తి స్థాయి ఫీచర్ ఫిల్మ్ అయితే.. ‘సచిన్’ సినిమా డాక్యుమెంటరీ టైపు. పైగా ధోని జీవితానికి సంబంధించి జనాలకు తెలియని కోణాలు చాలా ఉన్నాయి. అతడి నేపథ్యం ఆసక్తికరం. కానీ సచిన్ సంగతి వేరు. అతడి గురించి జనాలకు చాలా విషయాలు తెలుసు. 16  ఏళ్లకే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సచిన్ జీవితం తెరిచిన పుస్తకం. పైగా సచిన్ సినిమాను డాక్యుమెంటరీగా తీర్చిదిద్దడం వల్ల జనాల్లో అంత ఆసక్తి కలగలేదేమో. మరి ఫుల్ రన్లో ఈ సినిమా ఎంత వసూళ్లు రాబడుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News