#RRR ఆ సినిమాకు రీమేకా..?

Update: 2018-10-14 04:54 GMT
దర్శకధీరుడు SS రాజమౌళి సినిమా అంటే ప్రేక్షకుల్లోనే కాదు ట్రేడ్ వర్గాల్లో కూడా భారీ ఆసక్తి వ్యక్తమవుతుంది.   ఇక బాహుబలి రెండు భాగాలతో  భారీ బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాడు కాబట్టి తను నెక్స్ట్ చేయనున్న సినిమా ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఓ హాట్ టాపిక్.  రామ్ చరణ్.. జూనియర్ ఎన్టీఆర్ లాంటి టాప్ లీగ్ స్టార్లు ఈ సినిమా హీరోలు కావడంతో తెలుగు ప్రేక్షకులకు ఇదో మరపురాని మల్టి స్టారర్ చిత్రంగా మారిపోయింది.  ఈ ప్రాజెక్ట్ పైనున్న క్రేజ్ కు తగ్గట్టే  సినిమా కథ గురించి.. హీరో పాత్రల గురించి ఎన్నో రకాల వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా వినిపిస్తున్న టాక్ ఏంటంటే ఈ సినిమా కథ బాలీవుడ్ సినిమా 'గుండే' ఛాయలలో సాగుతుందట.  అర్జున్ కపూర్ - రణవీర్ సింగ్ - ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ సినిమాను తారక్ - చరణ్ ల స్టార్ ఇమేజ్ కి .. తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్చి స్క్రిప్ట్ ను వండుతున్నారట.  'గుండే' సినిమాలోని నేపథ్యం వరకూ తీసుకోవడం సరేగానీ ఆ సినిమా రీమేక్ అంటే మాత్రం నమ్మశక్యంగా లేదని కొందరి అభిప్రాయం.  ఎందుకంటే రాజమౌళి సినిమాకోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. ఒక్క తెలుగు వెర్షన్ అయితే హిందీ సినిమాను రీమేక్ చేసే అవకాశం ఉంటుంది కానీ పలు భాషలలో రిలీజ్ కానున్న #RRR హిందీ సినిమా రీమేక్ అయి ఉండకపోవచ్చని వారి అభిప్రాయం.

ఏదేమైనా ఈ సినిమా కథ విషయం మాత్రం అటు జక్కన్న కానీ ఇటు తారక్ -చెర్రీలుగానీ పెదవి విప్పడం లేదు.  'అరవింద సమేత' ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో ఎన్టీఆర్ ను #RRR గురించి అడిగితే లౌక్యంగా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నాడు గానీ ఒక్క ముక్క లీక్ చేయడం లేదు.  ఇక జక్కన్న స్వయంగా ఈ సినిమా గురించి అప్డేట్స్ చెప్పేవరకూ మనం వేచి చూడక తప్పదేమో. 
Tags:    

Similar News