బాలీవుడ్ కు ఈ ఫ్రైడే మ‌రో బిగ్ షాక్!

Update: 2022-12-23 15:33 GMT
బాలీవుడ్ గ‌త కొంత కాలంగా వ‌రుస డిజాస్ట‌ర్ ల‌ని ఎదుర్కొంటూ నిరాశ ప‌రుస్తోంది. క‌రోనా త‌రువాత హిందీ సినిమాల ప‌రిస్థితి మ‌రీ దారుణంగా త‌యారైంది. బిగ్ స్టార్స్‌, బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించే హీరోలు కూడా భారీ డిజాస్ట‌ర్ ల‌ని ఎదుర్కొంటూ షాక్ కు గురిచేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఎడారిలో ఓయాసిస్సులా.. చిమ్మ‌చీక‌ట్లో మిణుగురు పురుగులా అజ‌య్ దేవ్‌ గ‌న్ న‌టించిన `దృశ్యం 2` బాలీవుడ్ లో కొత్త ఆశ‌లు చిగురింప‌జేసింది. అయితే ఆ సంబ‌రం ఎంతో సేపు నిల‌వ‌లేదు.

`దృశ్యం 2` త‌రువాత మ‌ళ్లీ అదే ప‌రిస్థితి త‌లెత్తుతోంది. బ్యాక్ టు బ్యాక్ బాలీవుడ్ ని మ‌ళ్లీ వ‌రుస ఫ్లాపులు ప‌ల‌క‌రించ‌డం మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో అంద‌రి దృష్టి హిట్ మెషీన్ రోహిత్ శెట్టి , ర‌ణ్ వీర్ సింగ్ ల క‌ల‌యిక‌లో రూపొందుతున్న పీరియాడిక్ కామెడీ ఫిల్మ్ `స‌ర్క‌స్‌` పై ప‌డింది. విలిమ‌య్ షేక్స్పీయ‌ర్ ఫేమ‌స్ న‌వ‌ల `కామెడీ ఎర్ర‌ర్స్` ఆధారంగా రోహిత్ శెట్టి ఈ మూవీని తెర‌కెక్కించాడు. ర‌ణ్ వీర్ సింగ్ ద్విపాత్రాభిన‌యం చేయ‌గా, హీరోయిన్ లుగా పూజా హెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ న‌టించారు.

రోహిత్ శెట్టి, ర‌ణ్ వీర్ సింగ్ ల‌ది హిట్ కాంబినేష‌న్‌. గ‌తంలో వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో `సింబా` పేరుతో ప‌వ‌ర్ ఫుల్ కాప్ డ్రామా రూపొందిన విషయం తెలిసిందే. ఈ సూప‌ర్ హిట్ ఫిల్మ్ త‌రువాత వ‌స్తున్న స‌క్సెస్ ఫుల్ కాంబినేష‌న్ కావ‌డంతో `స‌ర్క‌స్‌` విష‌యంలో అంతా భారీగా ఎక్స్ పెక్ట్ చేశారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా రికార్డు స్థాయిలో వుంటాయని, సినిమా ఓ రేంజ్ లో చించేస్తుంద‌ని బావించారు. కానీ శుక్ర‌వారం డిసెంబ‌ర్ 23న విడుద‌లైన ఈ మూవీ అవేవీ చేయ‌లేక‌పోయింది.

ఒక్క ముక్క‌లో చెప్పాలంటే బాక్సాఫీస్ వ‌ద్ద బొక్క‌బోర్లా ప‌డింది. అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేక‌పోగా సినిమా బిలో యావ‌రేజ్ గా తేలి సాకిచ్చింది. బాలీవుడ్ మీడియా ఈ సినిమాకు 2.5 కి మించి రేటింగ్ ని ఇవ్వ‌లేక‌పోయాయి.

రోహిత్ శెట్టి సినిమాల‌కు ప్ర‌ధాన బ‌లంగా నిలిచిన యాక్ష‌న్‌, కామెడీ స‌న్నివేశాలు ఈ మూవీకి సంబంధించి ఏ విష‌యంలోనూ వ‌ర్క‌వుట్ కాలేద‌ని తేల్చేశాయి. ర‌ణ్ వీర్ సింగ్ డ‌బుల్ రోల్ బాక్సాఫీస్ వ‌ద్ద దారుణంగా ఫ్లాప్ అయింద‌ని రాసుకొచ్చాయి. `స‌ర్క‌స్‌` కు ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో కే బిగ్ షాక్ త‌గ‌ల‌డంతో రానున్న సినిమాల ప‌రిస్థితేంట‌నే చ‌ర్చ మొద‌లైంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News