ఆ చరణ్ అభిమాని ఇక లేడు

Update: 2017-07-15 07:31 GMT
రామ్ చరణ్ ముందు నిలబడి ‘ఒక్కొక్కణ్ని కాదు షేర్ ఖాన్..’ అంటూ పొడవాటి ‘మగధీర’ డైలాగ్ ను గుక్కతిప్పుకోకుండా చెప్పి ముచ్చటగొలిపిన చిన్నోడు గుర్తున్నాడా? ‘బాలధీర’గా గుర్తింపు తెచ్చుకుని సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించిన ఆ చిన్నోడి కథ విషాదాంతమైంది. అనారోగ్యం కారణం పదేళ్ల ఆ పిల్లాడు కన్నుమూశాడు. ఈ పిల్లాడి పేరు పరశురామ్. రామ్ చరణ్ ఆ పిల్లాడిని కలిసినప్పటికే అతను అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పరశురామ్ అనారోగ్యం ఏంటన్నదానిపై స్పష్టత లేదు కానీ.. అతను చనిపోయినప్పటి ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసిన వాళ్లందరి కళ్లు చెమ్మగిల్లుతున్నాయి.

మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ మారుమూల పల్లెటూరికి చెందిన పేద కుటుంబంలో పుట్టిన పరశురామ్ చిన్నప్పటి నుంచే రామ్ చరణ్ అభిమాని. ‘మగధీర’ సినిమా చూసి అందులోని డైలాగులన్నింటినీ బట్టీ పట్టేశాడు పరశురామ్. అతను హావభావాలతో సహా ఆ డైలాగులు చెబుతున్న వీడియో ఒకటి యూట్యూబ్ లోకి వచ్చింది. అది సూపర్ పాపులరైంది. పరశురామ్ కు సోషల్ మీడియా ‘బాలధీర’ అని పేరు పెట్టేసింది. చరణ్ కూడా ఈ వీడియో చూసి ఆశ్చర్యపోయి పరశురామ్ ను తన దగ్గరికి పిలిపించుకుని మాట్లాడాడు. పరశురామ్ బాగోగులు తాను చూసుకుంటానని.. చదువుకయ్యే ఖర్చు కూడా భరిస్తానని చరణ్ అప్పట్లో హామీ ఇచ్చాడు. ఇది జరిగి రెండేళ్లవగా.. మధ్యలో పరశురామ్ గురించి అప్ డేట్స్ ఏమీ లేవు. ఇప్పుడతను చనిపోయాడన్న వార్త బయటికి వచ్చింది.
Tags:    

Similar News