బిగ్ స్టోరీ: సినిమాలు - వాయిదాల పర్వం..!

Update: 2021-04-27 10:47 GMT
కరోనా వైరస్ సెకండ్ వేవ్ రోజురోజుకు విజృంభించడం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ప్రభుత్వాలు అప్రమత్తం చేస్తున్నా కేసుల సంఖ్య భారీగా పెరగడంతో పాటు మరణాలు కూడా అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమ మరోసారి కరోనా విలయతాండవాలనికి బలయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందుకే ఈసారి ప్రభుత్వాల కన్నా ముందే తెలుగు సినీ ఇండస్ట్రీ ముందుజాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది. స్వచ్ఛందంగా థియేటర్లు మూసేయాలని నిర్ణయించుకుంది. మరోవైపు షూటింగ్‌ లు కూడా నిలిచిపోతున్నాయి.. సినిమాలు వాయిదా పడుతున్నాయి.

కరోనా ప్రభావంతో ఇప్పటికే విడుదలకు సిద్ధమైన సినిమాలు వాయిదా బాట పట్టాయి. నాగచైతన్య 'లవ్‌స్టోరీ'.. నాని 'టక్ జగదీష్'.. రానా దగ్గుబాటి 'విరాటపర్వం'.. విశ్వక్‌ సేన్‌ 'పాగల్'‌ సినిమాలతో పాటుగా 'ఏక్ మినీ క‌థ‌' 'ఇష్క్' వంటి సినిమాలు రిలీజ్‌ లు వాయిదా వేసుకున్నాయి. ఇవన్నీ కూడా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు రెడీగా ఉన్న సినిమాలు. మే 14న రిలీజ్ చేస్తామని ప్రకటించిన 'నారప్ప' సినిమాపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి, కరోనా కారణంగా షూటింగ్ లేట్ అయ్యే అవ‌కాశం ఉండ‌టంతో వాయిదా పడే సినిమాలు కొన్ని ఉన్నాయి. చిరంజీవి - రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆచార్య' చిత్రాన్ని వచ్చే నెల 13న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించకపోవడంతో పోస్ట్ పోన్ చేయడానికి నిర్ణయించుకున్నారు.

ఇదే క్రమంలో కోవిడ్ నేపథ్యంలో షూటింగ్స్ లేట్ అవుతాయని కాబట్టి 'పుష్ప‌'(ఆగస్ట్ 13) - 'ఆర్.ఆర్.ఆర్'(అక్టోబర్ 13) - 'హ‌రిహ‌ర వీర మ‌ల్లు'(2022 సంక్రాంతి) వంటి భారీ బడ్జెట్ సినిమాలు వాయిదా పడే అవకాశాలు లేకపోలేదు. అయితే క‌రోనా ఉదృతి మ‌రో రెండు నెల‌లు ఇలానే కొన‌సాగితే పెద్ద సినిమాలు ఎక్కువగా న‌ష్ట‌పోతాయని చెప్పవచ్చు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ప్రభాస్ 'రాధే శ్యామ్' - యష్ 'కేజీఎఫ్ 2' - రాజమౌళి 'ఆర్.ఆర్.ఆర్' - అల్లు అర్జున్ 'పుష్ప' - పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' వంటి చిత్రాలు నష్టపోయే అవకాశం ఉంది. అలానే మహేష్ బాబు 'స‌ర్కారి వారి పాట' - నందమూరి బాలకృష్ణ 'అఖండ‌' - రవితేజ 'ఖిలాడి' సినిమాలు కూడా ఇదే వరుసలో ఉంటాయి. మరి రాబోయే రోజుల్లో పరిస్థితులు అనుకూలించి షూటింగుల సజావుగా సాగి, సినిమాలన్నీ అనుకున్న సమయానికి రిలీజ్ అవుతాయేమో చూడాలి.


Tags:    

Similar News