ప‌వ‌న్ నోట ఆ మాట ఎప్పుడూ రాదేం!

Update: 2022-06-14 02:30 GMT
టాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌ తెలుగు న‌టుల్ని ప్రోత్స‌హించ‌లేద‌నే అంశంపై  ఎప్ప‌టిక‌ప్పుడు అగ్ర‌హ జ్వాల‌లు ర‌గులుతూనే ఉంటాయి. లోక‌ల్ ట్యాలెంట్ కి ప్రాధాన్య‌త ఎక్క‌డ కనిపిస్తుంద‌న్న దానిపై  చిన్న స్థాయి ఆర్టిస్టులు సైతం నివురు గ‌ప్పిన సంద‌ర్భాలు కోకొల్ల‌లు. సొంత న‌టుల్ని ప‌క్క‌న‌బెట్టి ప‌ర‌భాష వైపు చూడ‌టం ఎంత వ‌ర‌కూ స‌మంజ‌సం అన్న దానిపై డిబేట్లు అంతే ఆస‌క్తిక‌రం.

ఎవ‌రో ఒక‌రు ఈ అంశాన్ని ఉన్న‌ట్లుడి తెర‌పైకి తీసుకురావ‌డం ఆ త‌ర్వాత దాన్నిచ‌ల్లార్చ‌డం ప‌రిపాటిగా మారిపోయింది. ఈ విష‌యంపై  దశాబ్ధులుగా పోరాటం జ‌రుగుతూనే ఉంది. అది అక్క‌డికే ప‌రిమిత మ‌వుతుంటుంది. ఇండ‌స్ర్టీ  పెద్ద‌గా ఉన్నంత కాలం  దివంగ‌త ద‌ర్శ‌క-నిర్మాత‌ దాసరి నారాయ‌ణ‌రావు దీనిపై సీరియ‌స్ గా స్టాండ్ తీసుకుని ముందుకొచ్చి మాట్లాడేవారు.

కొత్తగా  ప‌రిశ్ర‌మకి  వ‌చ్చే ఔత్సాహిక తెలుగు న‌టుల‌కు అవ‌కాశాలు క‌ల్పించాల‌ని ద‌ర్శ‌క‌-నిర్మాత‌ల‌కి విజ్ఞాప‌న‌తో పాటు..ఆజ్ఞ‌లు జారీ చేసిన సంద‌ర్భాలున్నాయి.  80 శాతం తెలుగు న‌టుల‌కే అవ‌కాశాలు క‌ల్పించేలా బ‌ల‌మైన చ‌ట్టం లాంటింది ప‌రిశ్ర‌మ‌లో తీసుకురావాల‌ని అనేవారు. కానీ అది  జ‌రిగిందెప్పుడు? ఇంకెప్పుడు జ‌రుగుతుంది? అన్న‌ది అంతే వాస్త‌వంగా చెప్పాలి.

ఆ త‌ర్వాతి కాలంలో మెగాస్టార్ చిరంజీవి..మంచు మోహ‌న్ బాబు..ముర‌ళీ మోహ‌న్ లాంటి వారు  దాస‌రి వ్యాఖ్య‌ల‌తో ఏకీభ‌వించిన‌ట్లు క‌నిపించినా సాధ్య‌ప‌డేదు. అయితే గుడ్డిలో మెల్ల  మాదిరి కొంత వ‌ర‌కూ అయితే మార్పులొచ్చాయి. టీవీ ఆర్టిస్టుల పోరాటం ఫ‌లితంగా త‌మ హ‌క్కుల్ని బుల్లి తెర‌వ‌ర‌కూ సాధించుకోగ‌లిగారు.

కొన్నేళ్ల‌గా  సీరియ‌ల్స్ కేవ‌లం  తెలుగు ఆర్టిస్టుల‌తోనే చేయ‌డం జ‌రుగుతోంది.  డ‌బ్బింగ్  సీరియ‌ల్స్ ని పూర్తిగా బ్యాన్ చేసి తెలుగు సీరియ‌ళ్లే ముద్దు అనేలా చేయ‌గ‌లిగారు. కానీ వెండి తెర‌పై మాత్రం అది ఇంకా సాధ్య‌ప‌డ‌లేదు. సినిమా అంటే కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చు కాబ‌ట్టి ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు త‌మ విజ‌న్ కి  అనుగుణంగా  ఉన్న‌వారినే పెట్టుకుని సినిమా చేస్తామని క‌రాఖండీగా చెప్పేయ‌డంతో సాధ్య‌ప‌డ‌లేదు.

అయితే ఇటీవ‌ల ప‌వ‌న్ ఓ వేడుక సాక్షిగా  చేసిన  వ్యాఖ్య‌లు టీవీ ఆర్టిస్టుల్లో  అసంతృప్తికి దారి తీసిన‌ట్లు క‌నిపిస్తుంది. సినిమా అంటే అన్ని భాష‌ల న‌టులుండాలి. ఒకే భాష  న‌టులతో ఎలా సాధ్య‌ప‌డుతుంది? అన్న తీరున వ్యాఖ్యానించారు. ఇప్పుడా వ్యాఖ్య‌లు కొంత మందిని ఆలోచ‌న‌లో ప‌డేసాయ‌ని వినిపిస్తుంది. తెలుగు భాష‌లోనే ఎంతో మంది న‌టులున్నారు. న‌టులుగా నిరూపించుకున్న వాళ్లు ఉన్నారు.

వాళ్లు ఇత‌ర భాష‌ల్లో కూడా న‌టిస్తున్నారు. న‌వ‌త‌రం ప్ర‌తిభ‌కి ప‌క్క ప‌రిశ్ర‌మ‌లు అవ‌కాశాలు  క‌ల్పిస్తున్నాయి.  కానీ టాలీవుడ్ మాత్ర ఇంకా త‌మ ప్ర‌తిభ‌ని గుర్తించ లేద‌ని వాపోతున్నారు. ప‌వ‌న్ సైతం క‌నీసం త‌మ లాంటి ప్ర‌తిభావంతుల్ని గుర్తించ‌క‌పోవ‌డం  సంగ‌తి ప‌క్క‌న‌బెడితే.. తెలుగు వాళ్ల‌కి అవ‌కాశాలు ఇవ్వాల‌ని ఏ నాడు క‌నీసం మాట వ‌రుస‌కు కూడా అన‌క‌పోవ‌డం శోచ‌నీయం  అంటున్నారు .

పై పెచ్చు ఇత‌ర భాష‌ల న‌టులంటేనే తెలుగు ప‌రిశ్ర‌మ వృద్దిలోకి వ‌చ్చింద‌న్న తీరున ఆయ‌న వ్యాఖ్య‌లు ఉన్నాయంటూ  కొంత‌మంది టీవీ న‌టులు  అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. `మేజ‌ర్` లో న‌టించిన అడ‌వి శేషు లాంటి వారు  తెలుగు వారు రావాలా?  లేక అలా న‌టించే ప‌ర‌భాష న‌టులు కావాలా? అంటూ సెటైర్లు సైతం ప‌డుతున్నాయి. మ‌రి వీటిపై ప‌వ‌న్ వివ‌ర‌ణ ఏదైనా ఉంటుందా? అన్న‌ది చూడాలి
Tags:    

Similar News