అందుకే ఆ సినిమా ఆడలేదన్న పరుచూరి

Update: 2020-12-16 11:30 GMT
పరుచూరి బ్రదర్స్ ప్రస్తావన లేకుండా తెలుగు సినిమా కథను గురించి చెప్పుకోవడం అసాధ్యం. రచయితలుగా వాళ్లకి గల అనుభవం అపారం. వాళ్ల కలం నుంచి జాలువారిన ఎన్నో కథలు విజయాలను అందుకున్నాయి. ఎంతోమంది అగ్రకథానాయకుల కెరియర్లో ఆ విజయాలు కీలకంగా నిలిచాయి. ఒక సాధారణ ప్రేక్షకుడు కోరుకునే ఏయే అంశాలు కథలో ఉండాలనేది వారికి బాగా తెలుసు. ఒక సినిమా విజయం .. అది విడుదలయ్యే సమయంపై కూడా ఆధారపడి ఉంటుందనేది వారి నమ్మకం. అందుకు సంబంధించిన ఒక విషయాన్ని 'పరుచూరి పలుకులు' వేదిక ద్వారా పరుచూరి గోపాలకృష్ణ పంచుకున్నారు.

"శివకృష్ణకి .. మాకు మధ్య మంచి అనుబంధం ఉంది. ఆయన తొలి సినిమా నుంచి మా ప్రయాణం కలిసి సాగుతూనే వచ్చింది. శివకృష్ణ కెరియర్లో గుర్తుండిపోయే సినిమాల్లో 'ఆడది' ఒకటిగా కనిపిస్తుంది. ఆ సినిమాలో విలన్ వేషం నన్ను వేయమని ఆయన వత్తిడి చేశారు. ''నేను వేసే పాత్ర కాదది .. నన్ను వదిలేయండి" అన్నాను. అయినా ఆయన పట్టువీడకపోవడంతో ఆ సినిమాలో ప్రతినాయక పాత్రను చేయవలసి వచ్చింది. ఫలితంగా నేను ప్రత్యక్షంగా విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. ఆ సినిమాలో నా పాత్ర విషయంలో నేను దేని గురించైతే భయపడ్డానో .. అదే జరిగింది.

'ఆడది' .. 'కర్తవ్యం' సినిమాలు ఒకే రోజున విడుదల అవుతున్నాయని తెలిసినప్పుడు కూడా నేను శివకృష్ణను బ్రతిమలాడాను. 'ఆడది' ఫస్టు కాపీ చూసినప్పుడు ఒకవారం తరువాత విడుదల చేయమని కోరాను. 'కర్తవ్యం' పెద్ద హిట్ అవుతుందని అనిపిస్తోంది. అందువలన 'ఆడది' విడుదల తేదీ వాయిదా వేసుకోవడం మంచిది అని చెప్పాను. శివకృష్ణ వినిపించుకోలేదు .. 'కర్తవ్యం' విడుదలైన రోజునే ఆయన 'ఆడది' సినిమాను విడుదల చేశారు. దాంతో 'ఆడది' సినిమా దెబ్బతింది .. 'కర్తవ్యం' సినిమా ఎక్కడికో వెళ్లిపోయింది. ఏదేమైనా శివకృష్ణ గొప్పనటుడు .. అభిరుచి కలిగిన నిర్మాత .. మంచి మనసున్న మనిషి" అని చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News