పరేష్ రావాల్ తో సెల్ఫీ.. జాగ్రత్తండోయ్

Update: 2016-05-18 13:30 GMT
సెలబ్రెటీలతో ఫొటోలు దిగాలని తెగ ఆరాటపడిపోతుంటారు కొందరు అభిమానులు. ఐతే ఇంతకుముందులాగా ఎవరికో కెమెరా ఇచ్చి పక్కన నిలబడి పోజులివ్వాల్సిన అవసరం లేకుండా సెలబ్రెటీ పక్కకు వెళ్లిపోయి మన ఫోన్ తో క్లిక్ కొట్టి క్షణాల్లో పని పూర్తి చేసే సౌలభ్యాన్ని సెల్ఫీ అందిస్తోంది. ఐతే ఇలా సెల్ఫీలు దిగేటపుడు ఆ సెలబ్రెటీకి ఇష్టం ఉందో లేదో చూస్కోవాలి.. అనుమతి తీసుకోవాలి. అలా కాకుండా మన పాటికి మనం సెల్ఫీ దిగేస్తే సెలబ్రెటీలకు కోపం రావచ్చు. ఒళ్లు మండి ఏదైనా చేయొచ్చు. బాలీవుడ్ సీనియర్ నటుడు పరేష్ రావల్ అదే చేశాడు. తన అనుమతి లేకుండా సెల్ఫీ దిగేస్తున్న అభిమానిని విసురుగా తోసేశాడు.

ముంబయి విమానాశ్రయంలో ఓ అభిమానికి ఈ చేదు అనుభవం ఎదురైంది. రావల్ ఫోన్లో మాట్లాడుతుండగా ఓ అభిమాని ఆయనకు దగ్గరగా వచ్చి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. ఇందుకు ఆయన అనుమతి తీసుకోలేదు. దీంతో ఆయన ఆ అభిమానిని తిడుతూ విసురుగా అవతలికి తోసేసి వెళ్లిపోయారు. తన అభిమాన నటుడు అలా చేసేసరికి ఆ అభిమానికి దిమ్మదిరిగిపోయింది.

ఎయిర్ పోర్టు బయటకు వచ్చిన తర్వాత పరేష్ రావల్ చాలా సేపు ఒక్కరే నిలబడి ఉన్నారని.. చాలా సీరియస్ గా కనిపించాడని.. ఆయన డ్రైవర్ కోసం వెతుకుతున్నట్లుగా అనిపించిందని.. అలాంటి టైంలో అనుమతి లేకుండా సెల్ఫీ దిగబోయేసరికి కోపం వచ్చి అలా ప్రవర్తించారని ప్రత్యక్ష సాక్షి ఒకరు వెల్లడించారు. ఐతే సెలబ్రెటీలకు ప్రైవసీ ఇవ్వకుండా ఇలా చేయడం తప్పే కదా.
Tags:    

Similar News