మంచి చేసినప్పుడు మెచ్చుకోవాల్సింది పోయి.. ఈ నెగెటివ్ కామెంట్స్ ఏంటో..!

Update: 2021-05-31 13:32 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క సేవాగుణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనేక సేవా కార్యక్రమాలతో రీల్ లైఫ్‌ లోనే కాదు రియల్ లైఫ్‌ లో కూడా హీరో అనిపిస్తున్నారు. ఆంధ్రా హాస్పిటల్స్‌ తో కలిసి 1000 మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించిన మహేష్.. ‘హీల్ ఎ చైల్డ్ ఫౌండేషన్’ సంస్థతో కలిసి వైద్య ఖర్చులు భరించలేని ఎంతో మంది చిన్నారుల కుటుంబాలకు ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నారు. అలానే ఆంధ్రప్రదేశ్‌ లో బుర్రిపాలెం మరియు తెలంగాణలోని సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకున్న మహేష్.. అనేక అభివృద్ది కార్యక్రమాలతో 'శ్రీమంతుడు' అనిపించుకున్నాడు. ఈ క్రమంలో నేడు తన తండ్రి కృష్ణ పుట్టినరోజు కావడంతో మరో మంచి పనికి పూనుకున్నారు మహేష్.

మహేష్ బాబు తన స్వగ్రామమైన బుర్రిపాలెంలోని ప్రజలందరికీ ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టారు. దీంతో సినీ రాజకీయ ప్రముఖులు అభిమానులు సోషల్ మీడియాలో మహేష్ ను అభినందిస్తున్నారు. అయితే మరికొందరు నెటిజన్స్ మాత్రం మహేష్ ప్రయత్నాన్ని మెచ్చుకివాల్సింది పోయి నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఒక్క రోజులో ఊరి మొత్తానికి వాక్సిన్ ఎలా వేయగలని కొందరు అంటుంటే.. ఒక్క ఊరికి వేస్తే సరిపోతుందా అని మరికొందరు అంటున్నారు. వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ ఇస్తున్నారు సరే.. రెండో డోస్ సంగతి ఏంటని వంకలు పెడుతున్నారు. అయితే ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమం ఆరు రోజుల జరగనుందని మహేష్ టీమ్ తెలిపింది.

బుర్రిపాలెం గ్రామంలో ఉన్న మొత్తం 12 వార్డులలో వ్యాక్సిన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న ప్రజలందరికీ ఇస్తామని వెల్లడించారు. అలాగే మొదటి డోసు వ్యాక్సిన్ వేయించుకున్న వారికి రెండవ డోసు ఇచ్చే ఏర్పాట్లు కూడా మహేష్ చెయ్యనున్నారని వివరణ ఇచ్చారు. మంచి పనులు ఎవరు చేసినా అభినందించాలి అంటుంటారు. కానీ సోషల్ మీడియాలో అది పెద్దగా కనిపించదు. మెచ్చుకునే వారి కంటే వంకలు పెట్టేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారనేది వాస్తవం. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కరోనా కష్ట కాలంలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేస్తుంటే.. సోనూ సూద్ తో కంపేర్ చేస్తూ నెగెటివ్ కామెంట్స్ పెట్టనవాళ్ళు చాలా మందే ఉన్నారు. సేవా కార్యక్రమాలు చేసే వారిని అభినందించపోయినా పర్వాలేదు కానీ తక్కువ చేస్తూ ట్రోల్ చేయడం తప్పు. మరి దీని గురించి అలాంటి వాళ్ళు ఎప్పుడు ఆలోచిస్తారో!
Tags:    

Similar News