కరోనాపై యుద్ధానికి ముందుకొచ్చిన నయన్

Update: 2020-04-04 13:30 GMT
ప్రస్తుతం కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాధి ఎప్పుడు ఎవరికి ఎలా సోకుతుందో తెలియని ఆందోళన పరిస్థితులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షల మందికి కరోనా సోకగా వేలమంది ప్రాణాలను కోల్పోయారు. అయితే ఈ వ్యాధిని ఇప్పుడే అంతం చేయకపోతే మున్ముందు దీని ప్రభావం మరింతగా పెరుగుతుందని గుర్తించిన పలు దేశాలు ఇప్పటికే తమ ప్రజలను పూర్తిగా ఇళ్లకే పరిమితం చేస్తూ లాకౌట్ ప్రకటించాయి. మనదేశంలో కూడా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించారు. ఈ లాకౌట్ వలన ముఖ్యంగా ప్రజల మధ్య సామాజిక దూరం తగ్గి కరోనా మరింతగా వ్యాప్తి చెందకుండా ఉంటుందని - అలానే ప్రజలు అందరూ కూడా దీని వెనుక ఉన్న వాస్తవాన్ని గ్రహించి ప్రభుత్వానికి సహకరించాలని ప్రధాని సూచించారు. దీని వలన అన్ని వ్యవస్థలు స్తంభించిపోయాయి. ఈ నేపథ్యంలో దినసరి కూలీలు - శ్రామికులు - కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ నుండి మేముసైతం పలువురు నటీనటులు - దర్శకులు - సాంకేతికనిపులు - తమకు తోచిన విధంగా కరోనా బాధితుల సహాయార్ధం విరాళం ఇచ్చారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ తమకు సాధ్యమైనంత సహాయం చేస్తూ అందరికి ఆదర్శంగా నిలిచారు.

ఇప్పుడు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే స్పందించిన వాళ్లలో ఎక్కువ మంది హీరోలు ఉండగా, హీరోయిన్లు ఒకరు ఇద్దరు మాత్రమే ఉన్నారు. ప్రణీత - లావణ్య త్రిపాఠీ - రకుల్ ప్రీత్ సింగ్ వీళ్ళలో ముందు వరసలో ఉన్నారు. ఇప్పుడు తాజాగా సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార భారీ సాయం చేయడానికి ముందుకొచ్చారు. రోజువారీ సినిమా కార్మికులకు రూ.20 లక్షలు విరాళం ప్రకటించి తన మంచి మనసుని చాటుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో దినసరి కార్మికులను - వారి కుటుంబాలను ఆదుకోవడం మన విధి అని - అందుకే తనకు వీలైనంత సాయం చేస్తున్నానని - మిగతావారు కూడా ముందుకు వచ్చి తమకు తోచిన సాయం చేస్తే అది వారికి ఎంతో మేలు చేస్తుందని నయనతార పిలుపునిచ్చింది. ఇప్పటి వరకు సౌత్ హీరోయిన్స్‌ లో అత్యధిక మొత్తాన్ని విరాళంగా ప్రకటించి రియల్ స్టార్ అనిపించుకుంది. మరి నయన్ చూసైనా మిగతా హీరోయిన్లు ముందుకు వస్తారేమో చూడాలి.
Tags:    

Similar News