నాజర్ .. ఇక సినిమాలకి దూరం ..?!

Update: 2022-06-30 00:30 GMT
నాజర్ .. చూడటానికి చాలా సింపుల్ గా ఉంటారు. కానీ ఏ పాత్రను ఇస్తే ఆ పాత్రలో ఒదిగిపోతారు. గ్రామీణ నేపథ్యంలోని కథే అయినా .. ఫారిన్ వీధుల్లో పరిగెత్తే కథే అయినా ఆయన పాత్రతో నిండుదనాన్ని సంతరించుకుంటుంది. ఇక విలేజ్ స్థాయి విలనిజమైనా .. కార్పొరేట్ స్థాయి విలనిజమైనా ఆయన అద్భుతంగా ఆవిష్కరిస్తారు. విలేజ్ నేపథ్యంలోని పాత్రల్లో ఆయన ఎంత మొరటుగా కనిపిస్తారో .. పట్నం కథల్లో అంత హుందాగా అనిపిస్తారు.

నాజర్  ఇటు సౌత్ లోను .. అటు నార్త్ లోను అనేక విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను పోషించారు. ఎవరూ కూడా ఆయనను పరభాషా నటుడిగా చూడకపోవడం ఆయన నటలోని గొప్పతనం. తమ భాషకి చెందిన ఆర్టిస్ట్ గానే అందరూ ఆయనను ఆదరించారు.

తనకి ఇచ్చిన పాత్రపట్ల అవగాహన పెంచుకోవడం .. అనుభవంలోకి తెచ్చుకోవడం .. సహజత్వానికి దగ్గరగా దానిని ఆవిష్కరించడం ఆయన ప్రత్యేకత. ఆ ప్రత్యేకతనే ఇన్ని దశాబ్దాల పాటు ఆయనను తెరపై నిలబెట్టింది. ఆయనకంటూ ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టింది.

1989లో 'కోకిల' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ఆయన, ఆ తరువాత వేషాలు కోసం వెయిట్ చేసింది లేదు. ఆయన పాత్రలను పండించిన తీరును .. నవరసాలను నడిపించిన తీరును గురించి ఒక పుస్తకం వేసుకోవచ్చు.

'బాహుబలి' సినిమాలో 'బిజ్జలదేవుడు' పాత్రను నాజర్ కాకుండా మరొకరైతే బాగా చేయగలరని ఎవరూ చెప్పలేరు.  ఎందుకంటే ఆ నటన .. ఆ డైలాగ్ డెలివరీ మరొకరికి సాధ్యం కాదు. అలాంటి నాజర్ నటనకి గుడ్ బై చెబుతున్నట్టుగా  కొన్ని రోజులుగా ఒక వార్త షికారు చేస్తోంది.

నాజర్ ఇప్పటికే నటుడిగా సుదీర్ఘమైన ప్రయాణం చేశారు. ఈ మధ్య ఆయన ఆరోగ్యం అంత బాగుండటం లేదనే టాక్  వినిపిస్తోంది. అందువల్లనే ఇక సినిమాలకు దూరంగా .. విశ్రాంత జీవితం గడపాలనే నిర్ణయానికి ఆయన వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయంలో ఆయన కుటుంబ సభ్యుల నుంచి స్పష్టత రావలసి ఉంది. గుమ్మడి తరువాత అంతటి సహజమైన నటుడు ఎవరైనా ఉన్నారంటే అది నాజర్ అనే చెప్పచ్చు. ఆయన దూరం పెట్టేసిన  సినిమా, చందమామ లేని కథలానే వెలితిగా ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు.
Tags:    

Similar News