ఫోటో స్టొరీ: ఆర్టీసి బస్సెక్కిన మజిలీ టీమ్

Update: 2019-01-31 16:02 GMT
అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో 'మజిలి' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  పెళ్ళైన తర్వాత చైతు-సమంతాలు కలిసి నటిస్తున్న చిత్రం కావడం.. పైగా ఇద్దరూ సినిమాలో భార్యాభర్తలుగా నటిస్తుండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.   ఈ సినిమాలో సమంతాతో మాత్రమే కాకుండా కాకుండా చైతు మరో హీరోయిన్ దివ్యాన్ష కౌశిక్ తో కూడా ప్రేమాయణం సాగిస్తాడట.

ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోందని సమాచారం.  తాజాగా ఈ సినిమా నుండి ఒక ఆన్ లొకేషన్ స్టిల్ బయటకు వచ్చింది.  ఈ ఫోటోలో నాగ చైతన్య.. దర్శకుడు  శివ నిర్వాణ.. కమెడియన్ ప్రవీణ్ లతో పాటు మరో ఇద్దరు ఉన్నారు.  ఒక ఆర్టీసీ బస్ ఫుట్ బోర్డు మీద నిలబడి మరీ వారందరూ ఈ ఫోటోకు పోజిచ్చారు.  గళ్ళ చొక్కా.. బ్లూ జీన్స్.. సాధారణమైన చెప్పులు వేసుకొని చేతిలో ఫోన్ పట్టుకున్న చైతు ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిలాగానే ఉన్నాడు.  ఫోటోలో అందరూ ఒకరిని మించి మరొకరు చిరునవ్వులు చిందిస్తుండడం విశేషం.  

ఈ చిత్రం ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.  గోపిసుందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.  ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి.. హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Tags:    

Similar News