#జీప్ రేసింగ్! దుమ్ము దులిపేస్తున్న మడ్ రేస్!!

Update: 2021-12-01 10:59 GMT
భారతదేశపు మొట్టమొదటి 4X4 మడ్ రేస్ చిత్రం మడ్డీ బహుభాషా చిత్రంగా డిసెంబర్ 10న విడుద‌ల‌వుతోంది. తెలుగు- తమిళం- మలయాళం- కన్నడ- హిందీ - ఇంగ్లీషు సహా 6 భాషల్లో భారీగా ఈ చిత్రం విడుదల కానుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అడ్వెంచర‌స్ యాక్షన్ ఫిల్మ్ ఇది. యాక్షన్- అడ్వెంచర్ - థ్రిల్స్ తో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించ‌నుంది.

నూతన దర్శకుడు డా. ప్రగాభల్ దర్శకత్వం వహించారు. PK 7 బ్యానర్ పై ప్రేమ కృష్ణదాస్ నిర్మించిన ఈ చిత్రం పూర్తి కావడానికి ఐదు సంవత్సరాలు పట్టింది. నేటిత‌రం నటీనటులు యువన్ - రిధాన్ కృష్ణ- అనూష సురేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో చాలా మంది తెలిసిన ముఖాలు కూడా కనిపిస్తున్నాయి. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమా తెలుగు హక్కులను సొంతం చేసుకోవడంతో మడ్డీకి తెలుగులో పెద్ద మద్దతు లభించింది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా విడుదల చేయడానికి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

తాజాగా థియేట్రికల్ ట్రైలర్ ను విడుద‌ల చేయ‌గా అది వైర‌ల్ గా మారింది. మ‌డ్ రేస్ నేప‌థ్యంలో జీప్ క్రాషింగ్ ఎపిసోడ్స్ స్టంట్స్ తో అడ‌వుల్లో అద్భుతంగా తెర‌కెక్కించార‌ని ట్రైల‌ర్ చెబుతోంది. ఎంపిక చేసుకున్న అడ‌వులు లోయ‌లు కొండ‌లు గుట్ట‌లు రేసింగ్ జీప్ ల‌తో బోలెడంత హంగామా ఆక‌ర్షిస్తోంది. సినిమాలో నటీనటులకు రెండేళ్ల పాటు ఆఫ్ రోడ్ మడ్ రేసింగ్ శిక్షణ ఇచ్చి డూప్ ల సపోర్ట్ లేకుండా సాహస సన్నివేశాలను చిత్రీకరించారు. కెజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఆర్.ఆర్. ప్ర‌ధానంగా అస్సెట్ కానుంది. రాత్ససన్ ఫేమ్ శాన్ లోకేష్ ఎడిటర్ - కెజి రతీష్ సినిమాటోగ్రాఫర్ గా వ‌ర్క్ చేస్తున్నారు.

అంతకుముందు ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను చిత్ర కళాకారులు విజయ్ సేతుపతి - శ్రీ మురళి తమ సోషల్ మీడియా పేజీల ద్వారా విడుదల చేయ‌గా మంచి స్పంద‌న వ‌చ్చింది. హిందీ టీజర్ ను బాలీవుడ్ స్టార్ అర్జున్ కపూర్,.. తమిళ టీజర్‌ను జయం రవి,.. కన్నడలో డాక్టర్ శివరాజ్ కుమార్,.. తెలుగు టీజర్ ను అనిల్ రావిపూడి విడుదల చేయగా.. ఫహద్ ఫాసిల్.., ఉన్ని ముకుందన్,.. అపర్ణ బాలమురళి,.. ఆసిఫ్ అలీ,.. సిజు విల్సన్,.. అమిత్ చక్కక్కల్ మలయాళ టీజర్ ను విడుదల చేశారు. దీనికి వీక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. మడ్డీని అందమైన -సాహసోపేతమైన ప్రదేశాలలో చిత్రీకరించారు. ఇది సినీ ప్రేమికులకు భిన్నమైన దృశ్యమాన అనుభూతిని ఇస్తుంది.

ప్రత్యర్థి జట్ల కథతో రూపొందిన ఈ చిత్రంలో ప్రతీకారం.. కుటుంబ జీవితం,.. యాక్షన్ .. కామెడీ కూడా ఉన్నాయి. ఈ స్పోర్ట్స్ ఈవెంట్ లో బురద రేసును అన్నిర‌కాల థ్రిల్స్ తో ప్రేక్షకులకు అందించడం దర్శకుడి అతిపెద్ద సవాలుగా మారింద‌ని ద‌ర్శ‌కుడు చెబుతున్నారు. ట్రైల‌ర్ దుమ్ము దులిపేస్తోంది. ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో కొత్త ఫేస్ ల‌ను సైతం మ‌రిపించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. మ‌డ్డీ లుక్ చూస్తుంటే.. ఇండియా వెర్ష‌న్ `డెత్ రేస్` లా ఉంది! అన్న ప్ర‌శంస‌లు ద‌క్క‌డం గ్యారెంటీ గా క‌నిపిస్తోంది.




Full View
Tags:    

Similar News