'మనుషులు ఇంకా మారలేదా' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన డైలాగ్ కింగ్

Update: 2020-04-30 13:00 GMT
కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ప్రళయ తాండవం చేస్తున్న విషయం తెలిసిందే. కంటికి కనిపించని కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. రోజురోజుకీ మృతుల సంఖ్య.. బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రభుత్వాలు అయోమయానికి గురవుతున్నాయి. కరోనా మహమ్మారి (కోవిడ్ -19) వ్యాప్తిని నివారించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌‌ డౌన్ ఆదేశాలు జారీ చేశాయి. ప్రజలు ఎవ్వరూ బయటకు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటూ కరోనా బాధితులకు వైద్య సహకారం అందిస్తున్నాయి. పోలీసులు, డాక్టర్లు, పారిశుధ్య కార్మికులు, మీడియా ప్రతినిధులు ప్రతీ క్షణం తీరికలేకుండా శ్రమిస్తూ కరోనా వైరస్ వ్యాప్తిని అరికడుతున్నారు. ప్రజలు కూడా లాక్ డౌన్ రూల్స్ స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నప్పటికీ కొన్ని ఏరియాల్లోని మాత్రం ఏదో ఒక సాకుతో పోలీసులు, డాక్టర్లు చేస్తున్న కృషికి అడ్డుపడుతూ రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అంతేకాకుండా కొందరు పారిశుధ్య కార్మికులపై డాక్టర్లపై చేయి చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కరోనా కల్లోలం సృష్టిస్తున్న ఈ లాక్‌డౌన్ సమయంలో ప్రజలు వ్యవహరిస్తున్న తీరు.. పోలీసు చర్యల గురించి మంచు మోహన్ బాబు ఘాటుగా స్పందించారు.

ఈ సందర్భంగా డైలాగ్ కింగ్ మోహన్ బాబు మాట్లాడుతూ.. ''మనం దైవాలుగా భావించవల్సిన డాక్టర్లపై, నర్సులపై అక్కడక్కడా కొందరు దాడి చేయడం చూస్తుంటే మనుషులు ఇంకా మారలేదా అనిపిస్తోంది. వైద్యో నారాయణో హరి అన్నమాటను వేదవాక్కుగా భావించాలి. పోలీసులు మన రక్షణ కోసం వాళ్ళ రక్షణను వదిలేసి లాఠీ ఎత్తేది మన మీదకాదు.. కరోనా వైరస్ మన మీద పాకకుండా ఉండటం కోసమని గుర్తించండి. పోలీసులను, డాక్టర్లను గౌరవించండి. అన్నదమ్ముల్లా కలిసి మెలసి ఉండండి. ఆ భగవంతున్ని ప్రార్థిస్తూ ప్రపంచం మొత్తం ఆరోగ్యంగా ఉండాలని కోరుకోండి'' అని అన్నారు. ఇంతకముందు మంచు విష్ణు కూడా స్పందిస్తూ ''ఈ కరోనా కష్టకాలంలో మన ఆరోగ్యం కోసం మన ప్రాణాల కోసం కష్టపడుతున్న వైద్య సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది పై వాదులాడంతో పాటు కొన్ని చోట్ల దాడి చేసిన దురదృష్టకరమైన వార్తలు కూడా ఇటీవలే వచ్చాయి. మన కోసం వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పని చేస్తోన్న వైద్య మరియు పోలీస్ సిబ్బంది పట్ల మనం ఎంతో కరుణతో ఎంతో కృతజ్ఞత చూపించాలి'' అని వీడియో ద్వారా తెలియజేసాడు.
Tags:    

Similar News