సూపర్ స్టార్ చేతుల మీదుగా మెగాస్టార్ మూవీ టైటిల్..!

Update: 2021-08-21 16:30 GMT
మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు మెహర్ రమేష్‌ కాంబినేషన్ లో ఓ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ రూపొందనున్న సంగతి తెలిసిందే. రేపు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు శనివారం ఉదయం ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇచ్చారు. రేపు మెగా బర్త్ డే నాడు ఉదయం 9 గంటలకు 'మెగా యూఫోరియా' అప్‌డేట్‌ గా సినిమా టైటిల్‌ ని వెల్లడించాలని మేకర్స్ ప్లాన్ చేసారు. అయితే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని చిత్ర నిర్మాతలు రివీల్ చేశారు.

చిరంజీవి - మెహర్ రమేష్ కాంబోలో వచ్చే సినిమా టైటిల్ ని రేపు సూపర్‌ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేస్తారని మేకర్స్ ప్రకటించారు. మెగాస్టార్ మూవీ టైటిల్ ను సూపర్ స్టార్ రిలీజ్ చేస్తుండటం వారి మధ్య అనుబంధాన్ని తెలియజేస్తోంది. ఇద్దరు హీరోల అభిమానుల మధ్య యూనిటీని కూడా పెంచుతుంది. గతంలో మహేష్ నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరు చీఫ్ గెస్ట్ గా హాజరై శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి వీరిద్దరూ ఒకరిపై ఉన్న ఒకరికి ఉన్న అనుబంధాన్ని చాటుకోనున్నారు.

కాగా, తమిళ బ్లాక్ బస్టర్ 'వేదాళం' రీమేక్‌ గా ఈ మెగా ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కెఎస్ రామారావు కు చెందిన క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థ నిర్మాణంలో భాగస్వామిగా ఉంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుందని మేకర్స్ తెలిపారు. ఇకపోతే ఈ చిత్రానికి 'భోళా శంకర్' 'ఆటో జానీ' 'అన్నయ్య కోసం' అనే టైటిల్స్‌ ప్రచారంలో ఉన్నాయి. వీటిలో ఏది ఫిక్స్ చేశారో తెలియాలంటే రేపు మహేశ్ బాబు ట్వీట్ చేసే వరకు ఆగాల్సిందే.
Tags:    

Similar News