చరణ్ 'పెద్ది' డీల్స్.. మేకర్స్ ప్లానేంటి?
మరికొద్ది రోజుల్లో టీజర్లు, మిగతా పాటలు, ట్రైలర్ విడుదల చేసి.. సినిమాపై ఇప్పటికే ఉన్న క్రేజ్ మరింత పెంచి, అధిక ధరలకు డీల్స్ క్లోజ్ చేయవచ్చన్నది మేకర్స్ స్పష్టమైన ప్లాన్ గా తెలుస్తోంది.;
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్ది షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఆ రూరల్ యాక్షన్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఆ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నట్లు సినీ వర్గాల సమాచారం.
మార్చి 27వ తేదీన సినిమాను వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయితే మూవీ డీల్స్ ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది. మూవీకి సంబంధించి డిస్ట్రిబ్యూషన్, థియేట్రికల్ హక్కులపై కొన్ని వార్తలు వచ్చినప్పటికీ అవేవీ నిజం కాదని సమాచారం. ప్రస్తుతం నిర్మాతలు ఒప్పందాల విషయంలో తొందరపడకుండా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారట.
ఇటీవల సినిమా నుంచి విడుదలైన చికిరి… పాట అదిరిపోయే రెస్పాన్స్ అందుకోవడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. ఒకే ఒక సాంగ్ తో ఓ రేంజ్ లో సినిమాపై క్రేజ్ ఏర్పడటం మేకర్స్ కు ఫుల్ భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకే ఇప్పుడే భారీ డీల్స్ కు వెంటనే ఓకే చెప్పకుండా.. మరిన్ని ప్రమోషన్స్ ద్వారా సినిమాపై హైప్ ను పెంచాలని నిర్మాతలు భావిస్తున్నారట.
మరికొద్ది రోజుల్లో టీజర్లు, మిగతా పాటలు, ట్రైలర్ విడుదల చేసి.. సినిమాపై ఇప్పటికే ఉన్న క్రేజ్ మరింత పెంచి, అధిక ధరలకు డీల్స్ క్లోజ్ చేయవచ్చన్నది మేకర్స్ స్పష్టమైన ప్లాన్ గా తెలుస్తోంది. అయితే మూవీకి ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు కూడా ప్రేక్షకులను ఫుల్ గా ఆకట్టుకుని సూపర్ హిట్ గా నిలిచాయి.
రెహమాన్ మ్యూజిక్‌తో పాటు గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న కథ, రామ్ చరణ్ పాత్రపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాలో సీనియర్ యాక్టర్ జగపతి బాబు అప్పలసూరి అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. కొన్ని రోజుల క్రితం విడుదలైన ఆయన లుక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అలాగే బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, హిందీ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కూడా ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉండటం విశేషం. భారీ బడ్జెట్, స్టార్ కాస్టింగ, టాప్ టెక్నికల్ టీమ్ తో రూపొందుతున్న పెద్దిపై ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది. మరి మార్చి 27న గ్రాండ్ గా విడుదల కానున్న ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే.. పెద్ది రామ్ చరణ్ కెరీర్ లో మరో మైల్ స్టోన్ మూవీగా నిలవడం ఖాయమని చెప్పాలి.